సారు నోట ఈ మాటలెందుకు? మరో 2 టర్మ్ లు నేనే సీఎం..

Update: 2019-09-16 05:41 GMT
ఎప్పుడూ లేని రీతిలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల కాలంలో తనకు ఎదురవుతున్న ప్రతికూల పరిణామాలపై ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు తనదైన రీతిలో పావులు కదిపే సరికొత్త ఆటను షురూ చేశారని చెప్పాలి. రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాక ముందే.. ఇంటా.. బయటా వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. కేసీఆర్ నోట.. మరో రెండు దఫాలు సీఎం నేనే అంటూ వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.

తెలంగాణ రాష్ట్రంలో తాను తప్పించి బలమైన రాజకీయ ఫోర్స్ మరేదీ లేదన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తాను యాక్టివ్ పాలిటిక్స్ లో మరికొన్నేళ్లు ఉంటానన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. కొడుక్కి సీఎం పగ్గాలు అప్పజెప్పేసి.. జాతీయ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేలా తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు.

తనకు ఆరోగ్యం బాగోవటం లేదంటూ సాగుతున్న ప్రచారాన్ని స్వయంగా సీఎమ్మే ప్రస్తావించటం చూస్తే.. ప్రజలకు క్లారిటీ ఇవ్వటంతో పాటు.. తాను నిక్షేపంగా ఉన్నానని.. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. అంతేనా.. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనలో తాను ఉన్నట్లుగా సాగు ప్రచారానికి చెక్ చెప్పేలా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా నేనెందుకు చేస్తా? అన్న మాటలు ఇందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు.

తాను ఆటలోనే ఉంటానని.. ఎగ్జిట్ అయ్యే ఆలోచనను బాహాటంగా చెప్పేయటం ద్వారా.. తోక జాడించాలనుకునే వారికి హెచ్చరికగా కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నట్లుగా చెప్పాలి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో రెండు టర్మ్ లు తానే ముఖ్యమంత్రినన్న వ్యాఖ్య చేయాల్సిన అవసరం కేసీఆర్ కు లేదు. కాకుంటే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ.. ఆ భావన ప్రజలకు.. ప్రతిపక్షాలకు తెలీకూడదన్న వ్యూహంతో పాటు.. తనకు తిరుగులేదన్న భావనను కలిగించే మైండ్ గేమ్ లో భాగంగానే కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News