కేసీఆర్ - సంఘాలు.. కార్మికుడే సమిధ

Update: 2019-11-07 05:39 GMT
ఎంత దారుణం.. ఎంత అమానుషం.. పాపం అనే పదం కూడా తక్కువే. కేసీఆర్, సంఘాల పంతాలు, పట్టుదలకు పాపం కార్మికులు బలి అయిపోతున్నారు. వీరి ఆధిపత్య పోరులో సమిధలవుతున్నారు. ఇప్పటికే 20 మంది వరకు ఆర్టీసీ కార్మికులు చనిపోగా.. తాజాగా సమ్మె ఇక ముగిసిపోదాని తెలిసి డిప్రెషన్ లోకి కార్మికులు వెళ్లిపోతున్నారు. కొందరు పిచ్చివాళ్లుగా మారిపోతున్న వైనం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఇంత కంటే ఘోరమైన సన్నివేశాలు ఉండవంటే అతిశయోక్తి కాదు..

సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. ఈనెల 5వ తేదీ తర్వాత ఎవరు వచ్చినా ఇక ఉద్యోగాల్లో చేర్చుకోరు. మొత్తం ప్రైవేటీకరిస్తానని కేసీఆర్ అంటున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు కేసీఆర్ డెడ్ లైన్ ను పాటించవద్దని కార్మికులను కోరుతున్నాయి. ఎవరిని ఉద్యోగాల్లో చేరకుండా అడ్డుకుంటున్నాయి.. బెదిరిస్తున్నాయి కూడా. సిరిసిల్లలో ఉద్యోగాల్లో చేరిన ముగ్గురు ఫొటోలను ఫ్లెక్సీ చేసి వారికి చెప్పుల దండలు వేసి ఊరేగించి అవమానించారు. హైదరాబాద్ లో డ్యూటీలో చేరిన ఓ ఆర్టీసీ కార్మికుడిని చితకబాదారు.

ఇలా కేసీఆర్ పంతం ఓవైపు.. కార్మిక సంఘాల పట్టుదల ఓవైపు ఉండడంతో కొలువులోకి వెళతామో లేదోనన్న ఆందోళన.. ఇల్లు, పిల్లలు, భార్యను ఎలా పోషించాలోనన్న భయం వెంటాడి ఓ ఆర్టీసీ కండక్టర్ పిచ్చివాడైన వైనం షాక్ కు గురిచేస్తోంది. ఉద్యోగాలు లేకుండా రెండు నెలలుగా ఖాళీగా ఉన్న కండక్టర్ చివరకు పిచ్చివాడైపోయాడు. ఉద్యోగం లేకపోతే ఎలా బతకాలనే ఆందోళన అన్నింటికి కంటే బాగా మనిషిని దహిస్తుంది.

ఇదే మథనపడుతూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన పులబోయిన నాగేశ్వర్ అనే కండక్టర్ మతస్థిమితం కోల్పోయాడు. తిండి, నిద్ర కూడా మరిచిపోయి డ్యూటీ అంటూ నవ్వుతున్నాడు. డిస్మిస్ అయినం అంటూ ఏడుస్తున్నాడు. హృదయవిదారకమైన ఈ కండక్టర్ ఉదంతం చూసైనా కేసీఆర్ కానీ.. కార్మిక సంఘాలు కానీ ఈ సమ్మెకు స్వస్తి పలికాలని తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు.
Tags:    

Similar News