హరీష్‌ ని పొమ్మనలేక పొగబెడుతున్నారా.?

Update: 2019-03-02 07:29 GMT
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత అందరికి అస్సలు అర్థం కాని విషయం ఒక్కటే. కేసీఆర్‌ హరీష్‌ రావుని ఎందుకు దూరం పెడుతున్నారా అని. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ కేంద్రానికి వెళ్తారని.. అప్పుడు ఇక్కడ కేటీఆర్‌ ని ముఖ్యమంత్రిని చేస్తారని వార్తలు వచ్చాయి. కేసీఆర్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు తోడూనీడగా.. ఆ వ్యవహారాలన్ని హరీష్‌ రావే దగ్గరుండి చూసుకుంటారని సమాచారం వచ్చింది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి కూడా కన్పించడం లేదు. పూర్తిగా హరీష్‌ ని పార్టీలో డమ్మీని చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్‌.

రెండు నెలల్లో లోక్‌ సభ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో.. ఈ బాధ్యతల్ని కేసీఆర్ హరీష్‌ కు అప్పగిస్తారని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు కేసీఆర్ మొత్తం లోక్‌ సభ ఎన్నికల్ని దగ్గరుండి చూసుకోబోతున్నారు. ఆయన ఖమ్మం - మొదక్‌ - జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాలపై దృష్టి సారించారు. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఫైనల్‌ చేయడం.. వారికి సహకరించే నాయకుల్ని ఏర్పాటు చేయడం దగ్గరనుంచి.. ఆ మూడు స్థానాల్ని దగ్గరుండి గెలిపించే బాధ్యత కేసీఆరే తీసుకున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్ని మంత్రులకు కేటాయించారు. వరంగల్‌ - మహబూబాబాద్‌ లకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు - కరీంనగర్‌ కు ఈటల రాజేందర్‌ - సికింద్రాబాద్‌ కు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ - మల్కాజిగిరి - చేవెళ్ల నియోజకవర్గాలకు మల్లారెడ్డి - భువనగిరి - నల్గొండ స్థానాలకు జగదీశ్‌ రెడ్డి - మహబూబ్‌ నగర్‌ స్థానానికి శ్రీనివాస్‌ గౌడ్‌ - నాగర్‌ కర్నూలుకు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి - ఆదిలాబాద్‌ కు ఇంద్రకరణ్‌ రెడ్డి - నిజామాబాద్‌ కు ప్రశాంత్‌ రెడ్డిని పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్లను ఇంచార్జులుగా నియమించారు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా హరీష్‌ రావు పేరు కానీ ప్రస్తావన కానీ రాకుండా జాగ్రత్తపడ్డారు. అంటే హరీష్‌ ప్రాధాన్యత క్రమాన్ని క్రమక్రమంగా కావాలనే కేసీఆర్ తగ్గిస్తున్నారని.. పాపం ట్రబుల్‌ షూటర్‌ కే ప్రస్తుతం ట్రబుల్స్‌ వచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News