ఢిల్లీకి వెళ్లిన తొలి రోజున సీఎం కేసీఆర్ ఏం చేశారు?

Update: 2022-10-13 05:16 GMT
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఢిల్లీకి వెళ్లినంతనే.. వారికి సంబంధించిన డిటైల్డ్ షెడ్యూల్ ముందుగా విడుదల చేసేవారు. ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు వరుస సమావేశాల్ని నిర్వహించుకొని వెనక్కి వచ్చేవారు. ఆ తీరుకు భిన్నంగా ఢిల్లీకి వెళ్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అసలు అక్కడేం చేస్తారు? ఎవరిని కలుస్తారు? అసలు ఎందుకు వెళతారు? ఎజెండా ఏమిటి? లాంటి వివరాలు అస్సలు బయటకు రావు. కొన్ని సందర్భాల్లో అయితే.. రెండు రోజులకో.. మూడు రోజులకో ఒక ప్రెస్ నోట్ విడుదల చేయటం కనిపిస్తుంది. అది కూడా.. వారి అవసరానికి అనుగుణంగానే తప్పించి మరోలా కాదు.

ఆ మధ్యన దాదాపు వారం ఉన్న కేసీఆర్.. ఢిల్లీలో ఏం చేశారన్నది అర్థం కాని పరిస్థితి. ప్రతిది గుట్టుగా ఉంచటం లాంటి తీరు సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని చెప్పాలి. ఈసారి ఢిల్లీకి కుమార్తె కవితతో వెళ్లిన కేసీఆర్.. తన తొలిరోజున కాస్తంత భిన్నంగా వ్యవహరించారనే చెప్పాలి. తాజా ఢిల్లీ టూర్ పై కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలు సంచలనంగా మారటం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇరుక్కున్నారని.. ఆమెను బయటపడేసేందుకు అవసరమైన చర్చల కోసం ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.

సుప్రీంకోర్టు లాయర్లు పలువురితో ఆయనకు సమావేశం ఉందని.. వారితో మద్యం స్కాంకు సంబంధించి.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై కూడా మదింపు జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటివేళ.. రోటీన్ కు భిన్నంగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. అప్పుడెప్పుడో ఢిల్లీలో పార్టీ భవనాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేయటం తెలిసిందే. ఆ పనుల పురోగతిని పరిశీలించే ప్రోగ్రాం పెట్టుకున్నారు కేసీఆర్.

పార్టీ భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రి.. పలువురు ఎంపీలతో కలిసి వసంత్ విహార్ లోని పార్టీ భవనాన్ని నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లిన ఆయన.. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని పర్యవేక్షించారు.

ఇలాంటి పనికి పెట్టుకుంటే గంటల తరబడి గడపటం కేసీఆర్ కు మామూలే. మీటింగ్ హాల్స్ ఎలా ఉండాలి? ఇతరగదులు ఎలా ఉండాలన్న దానిపై ప్రతి ఒక్కరికి సూచనలు ఇస్తూ ఉన్నారు.

ఇదంతా చూసినప్పుడు.. కేసీఆర్ ఢిల్లీ టూర్ మీద వస్తున్న వార్తల్లో నిజం లేదన్న తీరులో ఆయన వ్యవహారశైలి ఉండటం గమనార్హం. పార్టీ బిల్డింగ్ నిర్మాణం ఎలా జరుగుతుందన్న దాన్ని రివ్యూ చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి రావాలంటారా? మరెవరూ ఆ పనులు చేయలేరా? అన్నది అసలు ప్రశ్న.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News