​ఆ పథకం టార్గెట్ జీహెచ్ ఎంసీ ​!

Update: 2015-12-29 10:34 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూం పథకం కేవలం జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమేనా? మోడల్ గా కొన్ని ఇళ్లను నిర్మించి.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని ప్లాన్ వేశారా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

అధికారంలోకి రాకముందే కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు స్పష్టం చేయలేదు. కానీ గ్రేటర్ పరిధిలో 400 ఇళ్లను మాత్రం నమూనాగా నిర్మించారు. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇటీవలే ఘనంగా శంకుస్థాపన చేశారు. వాటికి విస్తృత ప్రచారం వచ్చేలా కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఏడాదికి నియోజకవర్గానికి వెయ్యి ఇళ్ల చొప్పున నిర్మిస్తామని ప్రకటించారు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అందరికీ ఇళ్లు పథకం నిధులతో అనుసంధానం చేసి డబుల్ బెడ్ రూం పథకాన్ని అమలు చేయాలన్నది ప్రభుత్వ యోచన.

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి డబుల్ బెడ్ రూం పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే నగరంలో ఎక్కడికక్కడ దరఖాస్తులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరికి, మజ్లిస్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. తద్వారా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆశ చూపించి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా పాతేయాలన్నది టీఆర్ఎస్, మజ్లిస్ ఆలోచనగా ఆయాపార్టీల నాయకులు చెబుతున్నారు.
Tags:    

Similar News