కేసీఆర్ ముందస్తు ఖర్చు 3వేల కోట్లు..

Update: 2018-09-09 05:38 GMT
నాయకుడన్నాక ప్రజలను నమ్మించాలి.. ఒప్పించాలి. తెలంగాణలోనే కాదు.. దేశంలోనే రాజకీయంగా ఆరితేరిన నాయకుల్లో కేసీఆర్ ఒకరు. అందుకే తన లక్ష్యాలు వేరుగా ఉన్నా.. ముందస్తు ఎన్నికలకు ఒక స్ట్రాటజీతో వెళ్లి సానుభూతి పొందుతున్నారు. ప్రజల్లోకి చెప్పింది ఒకటి.. ఆయన చేస్తోంది ఒకటి అని ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకున్నా సరే.. ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు.  తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ మాటలనే వింటోంది. కేసీఆర్ అంత స్మూత్ గా జనాలను నమ్మిస్తున్నారు మరి..

తెలంగాణ యాస, భాషను ఆవపోసన పట్టిన కేసీఆర్ జనాలకు అర్థమయ్యే రీతిలో చెబుతూ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘అభివృద్ధి ఆగిపోకూదని.. ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ’ వాపోయారు. మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని.. ఇది కొనసాగాలంటే మరింత మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంటే జనాలకు పథకాలు అందాలంటే చచ్చినట్టు మమ్మల్ని గెలిపించాల్సిందేనని ఓ రకమైన బ్లాక్ మెయిల్ చేసినట్టే.. అయితే కేసీఆర్ పథకాలతో లబ్ధి పొందుతున్న ఎంతో మంది లబ్ధిదారులకు కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్ అర్థం కాకపోవచ్చు.. వారికి వచ్చేటివి ఆగిపోతాయన్న భయం జనాలను వెంటాడుతోంది. అందుకే ఏటేస్తున్నావ్ ఓటు అంటే.. కారుకే గుద్దుతా అంటూ ముసలి ముతక ఘంఠాపథంగా చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్ ముందస్తు ముచ్చట ఎలాగున్నా తెరవెనుక పెద్ద కథే ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది.కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ తెరవెనుక అవగాహన కానీ , కేసీఆర్ స్వయంగా జాతీయ రాజకీయాలకు వెళ్లాలనే అభిలాష గానీ, ఇతరత్రా రహస్య ఏజెండా పెట్టుకున్నారని వారు డౌట్ పడుతున్నారు. అభివృద్ధి ఆగకూడదనేది కేవలం ముసుగు మాత్రమేనని ఆరోపిస్తున్నారు.

అయితే ఈసీ లెక్కల ప్రకారం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ముచ్చట ఖర్చు అక్షరాల 3వేల కోట్ల రూపాయలట. ఇంత భారీ మొత్తం జనాలపై భారంగా మారుతున్నా కేసీఆర్ ముందస్తు ముచ్చట తీర్చుకుంటున్నాడట..  సార్వత్రిక ఎన్నికలతోపాటు అయితే ఈ మొత్తం  ప్రభుత్వానికి మిగిలి ఉండేది. పలుమార్లు ఈసీ కూడా ఇలా ముందస్తుతో ఖర్చు పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.  సొంత ఎజెండా కోసం కేసీఆర్ ఇంత దుబారా ఖర్చు చేస్తున్న తీరుపై ఎంతో మంది గొంతు చించుకుంటున్నా ఏమున్నది ఫలితం అన్నట్టుంది పరిస్థితి..
Tags:    

Similar News