కేసీఆర్ అత్యవసర సమావేశం...తెలంగాణలో 144 సెక్షన్?

Update: 2020-03-19 07:50 GMT
కరోనా...ప్రపంచం లోని అగ్రరాజ్యాధ్యక్షుడిని సైతం వణికిస్తోన్న డేంజరస్ వైరస్ వెపన్. కంటికి కనిపించని ఈ వైరస్ మహమ్మారితో పోరాడేందుకు భారత్ తో సహా చాలా దేశాలు పలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ఇప్పటికే చైనా, ఇటలీ సహా పలు దేశాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోండగా ...భారత్ లోని పలు రాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ వాతావరణం ఉంది. ప్రజలందరూ ఒక చోట గుమిగూడడానికి అవకాశముండే అన్ని కార్యక్రమాలను పలు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో మార్చి 31 వరకు షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, థియేటర్లు, షూటింగ్ లు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో మొత్తం 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా..నిన్న ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ సర్కార్ మరింత అప్రమత్తమైంది. కొద్దిరోజుల పాటు తెలంగాణలో 144 సెక్షన్ విధించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రజలెవరూ బయట తిరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా స్టేజ్ 2లోకి ఎంటర్ అయిందని ఆరోగ్యశాఖాధికారులు భావిస్తున్నారు. మరో రెండువారాల పాటు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ కీలకమైన ప్రకటన చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కరోనాను దీటుగా ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీనికితోడు కరీం నగర్ లో కరోనా వ్యవహారం కేసీఆర్ ను కలవరపెడుతోందట. ఈ నేపథ్యంలోనే కొంచెం కఠినంగా అనిపించినా....తెలంగాణలో 144 సెక్షన్ విధించాలని కేసీఆర్ యోచిస్తున్నారట. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలను ఇళ్లదగ్గరే ఉంచాలని, అందుకు 144 సెక్షన్ విధించడం ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం తర్వాతే 144 సెక్షన్ వ్యవహారం పై పూర్తి క్లారిటీ రానుంది.
Tags:    

Similar News