మరోసారి టీఆర్‌ఎస్ చీఫ్ లఫంగి, లత్కోరు అంటూ కేసీఆర్ చంద్రబాబుపై ఫైర్ అయ్యాడు. ఆడియో టేపులు విడుదలయిన విషయంపై బాబు 'మహాసంకల్ప సభ'లో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా నల్గొండలో జరిగిన వాటర్‌గ్రిడ్ పథకం ప్రారంభోత్సవంలో కేసీఆర్... చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. ''ఇవ్వాల ఆంధ్రనాయకులు అడ్డుగోలు రాజకీయాలు చేస్తున్నారు. ఇయాల చంద్రబాబు ఆంధ్రలో మీటింగు పెట్టుకుని ఏసీబీతో నన్ను అన్యాయంగా ఇరికించారని అంటున్నాడు. నువ్వు ఇరికిస్తే ఇరుక్కునేటోడివా.. ఎవర్నైనా ఇరికిస్తావే తప్ప నువ్వు ఇరుక్కుంటావా? పక్కనోడి ఇల్లు తగలబెడుతావే తప్ప... నీ ఇల్లు తగల బెడుతావా? నువ్వు అడ్డంగా దొరికావు. పక్క రాష్ట్రమోడొచ్చి మా ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీని గెలిపిస్తానంటే మేము గాజులు తొడుక్కుని కూర్చోవాలా? నీవు అంత నీతి మంతుడివే అయితే.. నీకు బలం లేనప్పుడు ఎమ్మెల్సీ పోటీకి ఎలా పోటీ పెడతావు? అంటే పక్క పార్టీవాళ్ళను లాక్కుని లఫంగి.. లత్కోరు పని చేయాలని చూసి.. అడ్డంగా బుక్కయ్యావు. తెలంగాణ సమాజం మొత్తం నీ బండారం చూసింది. నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. హైదరాబాద్‌లో నాకూ హక్కుంది అంటున్నావు. ఏం నీ అబ్బజాగీరా, నీ తాత జాగీరా హైదరాబాద్. హైదరాబాద్‌కి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. అది గుర్తుంచుకో. నీ ఏసీబీ ఉండేది హైదరాబాద్‌లో కాదు. లాండ్ అర్డర్‌పై మీకు హక్కు ఎక్కడుంది. రామేశ్వరం పోయినా శని పోలేదు అన్నట్టు... ఆ నాడు కాంగ్రెస్ సన్నాసులు హైదరాబాద్‌ను పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధాని చేసిండ్రు. ఇంకా ఆంధ్రావాళ్ళ కిరికిరి పోలే. చంద్రబాబు నీ ఏసీబీ ఇక్కడుంటే... నీలాగ నేను లఫంగి, లత్కోరు పని చేసి పట్టుబడను. మా తెలంగాణ బిడ్డ ఆంగ్లో ఇండియన్‌ని ప్రలోభ పెట్టాలని చూస్తే... నీ ఎమ్మెల్యేను పట్టించాడు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలో నీ పాత్ర కూడా బయటపడుతోంది. నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు'' అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు.