ఎవడో లఫంగా పేపరగాడు రాత్తడు

Update: 2015-11-18 04:35 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త ప్రత్యేకం. ఆయనకు ప్రేమ పొంగుకు వస్తే.. ఎంత తియ్యగా మాటలు చెబుతారు.. అగ్రహం వస్తే అంతే తీవ్రస్థాయిలో మండిపడతారు. తనను అభిమానించి.. ఆరాధించే వారి పట్ల ఎంతో దయగా వ్యవహరించే ఆయన.. తనను ఇరుకున పెట్టే వారి విషయంలో నిప్పులు చెరుగుతారు. నిజానికి కేసీఆర్ మాత్రమే కాదు.. ఎవరైనా అలానే వ్యవహరిస్తారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన నోటి వచ్చే మాటలు ఏవైనా మనసుల్లో బలంగా నాటుకు పోతాయి. తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక స్ట్రాంగ్ కాఫీలా కేసీఆర్ మాటలు ఉంటాయి.

ఆయన మాట్లాడితే.. అప్పటివరకూ మనసులోని భావాలన్నీ తుడుచుపెట్టుకుపోయి.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు మనసులో శిలాక్షరాలుగా నాటుకుపోతాయి. తాజాగా హన్మకొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభనే తీసుకుంటే.. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ సభలో తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజకీయ నాయకుల మీదనే కాదు.. తమ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. నిరసనలు చేస్తున్న వారిని విడిచి పెట్టని కేసీఆర్.. తనపై విమర్శలు చేసే మీడియాను కూడా ఆయన వదల్లేదు. ఆయా వర్గాలపై కేసీఆర్ చేసిన విమర్శలు.. ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘సోదరులారా నేను ఇంకో మాట మనవి చేస్తున్నా. కొందరు కాంగ్రెస్ నాయకులు కొందరు రైతులకు ఎక్కువ డబ్బులిచ్చి పత్తి చేలు కాలబెట్టిచ్చి.. టీఆర్ ఎస్ ను బద్నాం చేస్తున్నరు. పంటలు తగులబెట్టిస్తున్నరు’’

‘‘కొంతమంది శిఖండీలు మంత్రుల సభలకు ఎవర్నో ఒకర్ని తోలించి.. ఏదో ఒకటి అడిగిస్తరు’’

‘‘ఎవడో లఫంగా పేపర్ గాడు రాత్తడు’’

‘‘అట్ల బద్మాష్ ప్రచారం చేస్తరా? ఎన్నికల్లో నిలబడ్డవారు ప్రజలకు దండాలు పెట్టాలే. వాస్తవాలు చెప్పాలే. ప్రజలు దయతలచి గెలిపిస్తే గెలవాలే. అంతేకానీ ఓట్ల కోసం ఇన్ని అబద్దాలు.. అసత్యాలు.. పనికిమాలిన మాటలు మాట్లాడల్నా..?’’
Tags:    

Similar News