అప్పుడు సోనియా..ఇప్పుడు మోడీ..సేమ్ టు సేమ్‌!

Update: 2018-09-03 11:38 GMT
మేలు చేసినోడ్ని నెత్తిన పెట్టుకొని ఊరేగించ‌కున్నా ఫ‌ర్లేదు కానీ.. దారుణంగా తిట్టి పోయ‌టం మాత్రం అన్యాయ‌మే. అయితే.. కొంద‌రికి ఇలాంటివేమీ ప‌ట్ట‌వు. అలాంటి జాబితాలోకి వ‌స్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆయ‌నే అనుకుంటే ఆయ‌న పుత్ర‌ర‌త్నం సైతం ఇదే తీరులో వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించాల‌న్న ఉద్య‌మ నినాదాన్ని అందుకున్న కేసీఆర్‌.. అలుపెర‌గ‌ని రీతిలో కిందామీదా ప‌డుతూ ఉద్య‌మాన్ని న‌డిపించారు. చివ‌ర‌కు ఆయ‌న అనుకున్న‌ది సాధించారు. అయితే.. ఇందుకు నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తెలంగాణ‌ను కొత్త రాష్ట్రంగా ప్ర‌క‌టించ‌టానికి ఆమె భారీ జూదాన్నే ఆడారు.

తెలంగాణ వారికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఏపీలో బ‌లంగా ఉన్న‌కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి ప‌డిపోతున్నా.. అక్క‌డ పార్టీ ఫ్యూచ‌ర్ భూస్థాపితం అవుతుంద‌న్న విష‌యం తెలిసినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎవ‌రు అవున‌న్నా..కాద‌న్నా.. సోనియాగాంధీ అన్న వ్య‌క్తే లేకుండా తెలంగాణ లేద‌ని చెప్పాలి. కొంద‌రు ఉద్య‌మ‌మే సోనియా చేత తెలంగాణ‌ను ఇప్పించింద‌ని.. ఆమెకంటూ ప్ర‌త్యేక గౌర‌వాన్ని ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌తారు. ఒక‌వేళ అదే మాట నిజ‌మ‌నుకుందాం.

రాజ్య‌స‌భ‌లో దేశ ప్ర‌ధాని ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. బీజేపీ.. కాంగ్రెస్ లు ప్ర‌త్యేక హోదాను ఇస్తామంటూ ఇస్తామంటూ బ‌ల్ల‌గుద్ది చెప్పిన త‌ర్వాత కూడా హోదా అమ‌లు కాకుండా పోతుందా?  వాస్త‌వంగా జ‌రిగిందేమిటి?  మోడీ మాష్టారు ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్నంత‌నే మైండ్ సెట్ మారిపోయింది. తిరుప‌తి.. గుంటూరు.. విశాఖ‌లో ఏర్పాటు చేసిన స‌భ‌ల్లో త‌న‌కు తానే ఏపీకి ప్ర‌త్యేక హోదాను అమ‌లు చేస్తామ‌న్న మాట‌తో పాటు.. అమ‌రావ‌తిని ఢిల్లీని త‌ల‌ద‌న్నేలా నిర్మిస్తామ‌న్న మాట చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

మ‌రి.. మోడీ లాంటి అద్భుత‌మైన వ్య‌క్తి త‌న‌కు తానుగా ఇచ్చిన హామీని ఎంత‌మేర‌కు అమ‌లు చేశారో తెలిసిందే. తెలంగాణ ఉద్య‌మంలో ఎలా అయితే తెలంగాణ ప్ర‌జ‌లు ఆత్మ‌బ‌లిదానాల‌కు తెగ‌బ‌డ్డారో.. ఇప్పుడు అదే త‌ర‌హాలో ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వాలంటూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న పాల‌కుల‌కు లేకుంటే.. ఎంత‌మంది ప్రాణాలు తీసుకున్నా ఏమీ ప‌ట్ట‌న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఏపీ ప్ర‌త్యేక హోదా ఇవ్వాలంటూ బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు గురి కావ‌టం.

ఈ లెక్క‌న కేంద్రం కాని మొండిగా ఉండి.. ఎంత‌మంది చ‌నిపోయినా.. త‌మ‌కు తాముగా ప్రాణాలు తీసుకున్నా ప‌ట్టించుకోకూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే తెలంగాణ వ‌చ్చేదా? ఈ మాట చెప్పినంత‌నే చాలామందికి కోపాలు వ‌స్తాయి. ప్రాక్టిక‌ల్ గానే ఆలోచించండి.. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌ర‌కూ ఎందుకు?  తెలంగాణ‌ను సాధించిన‌ట్లు చెప్పుకునే కేసీఆర్ సంగ‌తే చూడండి. ఆయ‌న హ‌యాంలో విప‌క్షాలు భారీ స‌భ‌ను కూడా నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి. ఉద్య‌మంలో కీ రోల్ ప్లే చేసి.. ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌కుల‌కు త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో ముచ్చ‌మ‌ట‌లు పోయించిన కోదండ‌రాం లాంటి ఉద్య‌మ‌కారుడు త‌న‌కు తాను పార్టీ పెట్టి.. ఆ పార్టీ త‌ర‌ఫున స‌భ పెడ‌దామంటే పాల‌కుడిగా ఉన్న కేసీఆర్ ఎన్ని తిప్ప‌లు పెడుతున్నారో తెలిసిందే.

ఇలాంటి వేళ‌.. పాల‌కులు కానీ ప్ర‌త్యేక‌రాష్ట్రాన్ని ఇవ్వ‌కూడ‌ద‌ని డిసైడ్ అయితే ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు?  కేసీఆర్ మాత్ర‌మే కాదు.. ఇంకెవ‌రు సీన్లోకి వ‌చ్చినా తెలంగాణ వ‌చ్చేది కాద‌న్న‌ది నిష్ఠుర స‌త్యం. ఎందుకిలా అంటే.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌టం ద్వారా సోనియాగాంధీ రాజ‌కీయంగా చాలానే త్యాగం చేయాల్సి వ‌చ్చింద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అలాంటి సోనియాను ఉద్దేశించి.. అమ్మ కాదు బొమ్మ అన‌టం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? 

ఎంత‌మంది తెలంగాణ బిడ్డ‌లు ప్రాణాలు పోయేందుకు సోనియా కార‌ణ‌మంటూ నింద‌లు వేసే వారు మ‌ర్చిపోకూడని విష‌యం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌టం కోసం తెర వెనుక చాలానే క‌స‌ర‌త్తు చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణను ఇచ్చిన సోనియాను కేసీఆర్ తిట్టిన‌ట్లే.. తెలంగాణ తెచ్చిన‌ప్పుడు ఎంత ఆనందం వేసిందో.. జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను కేంద్రం చేత ఒప్పించి మొండి మోడీ చేత సంత‌కం పెట్టించుకురావ‌టం అంటే మాట‌లు కాదు. ఏపీకి ధ‌ర్మంగా ఇవ్వాల్సిన ఆర్థిక లోటును భ‌ర్తీ చేయ‌కుండా హ్యాండ్ ఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అంతేనా.. కేర‌ళ ఆ ర‌కంగా మునిగిపోతే.. ముష్టి విదిల్చిన‌ట్లుగా నిధులు ఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోలేం. అలాంటి మోడీని ఒప్పించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. ఆ ప‌ని చేసిన కేసీఆర్ ను అభినందించాల్సిందే. అదే స‌మ‌యంలో ఇస్తావా.. చ‌స్తావా? అంటూ మోడీని నిల‌దీసి మ‌రీ జోన‌ల్ బిల్లు మీద సంత‌కం పెట్టించుకొని వ‌చ్చాన‌ని చెప్ప‌టం కూడా అత్యుత్సాహ‌మే.

తెలంగాణ‌కు మేలు చేసేటోళ్ల‌ను అదే ప‌నిగా తిట్టుకుంటూ పోతే.. రేపొద్దున తెలంగాణ‌కు ఏదైనా సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆదుకోవ‌టానికి ఎవ‌రు ముందుకు రాని ప‌రిస్థితి నెల‌కొంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు చేసినోళ్ల‌ను కీర్తించ‌కున్నా ఫ‌ర్లేదు.. దూషించ‌టం మాత్రం త‌ప్పు. ఇలాంటివి రాజ‌కీయాల్లో కష్ట‌మా? అంటే కాద‌నే చెప్పాలి. తెలంగాణ ఉద్య‌మం జ‌రిగిన‌ప్పుడు.. ఎంతటి భావోద్వేగంలోనూ సోనియాను కేసీఆర్ ప‌ల్లెత్తు మాట అనే వారు కాదు. ఎందుకంటే.. ఒక‌సారి కానీ తాను నోరు జారితే అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల‌న్న స‌త్యం కేసీఆర్ కు తెలుసు. అందుకే ఆయ‌న సోనియాను ప‌ల్లెత్తు మాట అన‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండేవారు. ఆచితూచి మాట్లాడేవారు.

మ‌రి.. అదే కేసీఆర్ సోనియా.. మోడీని ఉద్దేశించి అంతేసి మాట‌లు ఎందుకు అంటున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న వేసుకుంటే.. ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తుంది. తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌ని.. త‌న‌కు త‌గిన ప్ర‌త్యామ్నాయం ఇప్ప‌ట్లో రాద‌న్న భ‌రోసానే కేసీఆర్ చేత అన్నేసి మాట‌లు అనేలా చేస్తుంద‌ని చెప్పాలి. మంచిగా కాలం జ‌రిగినంత కాలం బాగానే ఉంటుంది. రేపొద్దున ఏదైనా తేడా కొట్టిన రోజున‌.. ఇప్ప‌టి మాట‌ల‌కు వ‌డ్డీతో స‌హా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News