కేసీఆర్ ఉదార‌త చూశారా?

Update: 2017-03-28 05:06 GMT
తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణ రాష్ట్రం... దేశంలోనే గుజ‌రాత్ త‌ర్వాత రెండో ధ‌నిక రాష్ట్రంగా అవ‌త‌రించింది. ల‌క్ష కోట్ల‌కు పైగా వార్షిక బ‌డ్జెట్‌ తో కేసీఆర్ స‌ర్కారు... త‌న తొలి ప‌ద్దులోనే రికార్డుల‌ను న‌మోదు చేసింది. ఆదాయం క్ర‌మంగా త‌గ్గుతున్నా... ఆయా శాఖ‌ల‌కు, కొత్త‌గా ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌కు నిధుల కొర‌త రాకుండా కేసీఆర్ చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన కేసీఆర్‌... రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మలు వ‌చ్చేలానూ స్వీయ ప‌ర్య‌వేక్షణ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే... దుబారా విష‌యంలో మాత్రం కేసీఆర్ చేతికి ఎముకే లేద‌న్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొన్న‌టికి మొన్న తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రిస్తే మొక్కులు చెల్లిస్తాన‌ని అప్పుడెప్పుడో ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన వాగ్దానాల మేర‌కు కేసీఆర్‌... కోట్లాది రూపాయ‌ల ప్ర‌జా ధ‌నాన్ని వెచ్చించి... ప‌లువురు దేవుళ్ల‌కు భూరి విరాళాలు అంద‌జేశారు. దీనిపై ప‌లు వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇవేవీ ప‌ట్టించుకోని కేసీఆర్‌... తాను అనుకున్న‌ది చేసుకుంటూనే పోతున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల ముగింపు రోజున కేసీఆర్ స‌ర్కారు మ‌రో ఆస‌క్తిక‌ర స‌న్నివేశానికి తెర తీసింది. అసెంబ్లీ - శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌కు కొత్త ల్యాప్‌ టాప్‌ ల‌ను అందించే కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. స‌మావేశాల ముగింపును పుర‌స్క‌రించుకుని నిన్న ఆర్థిక శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నిన్న ఉభ‌య స‌భ‌ల స‌భ్యుల‌కు ప్ర‌త్యేకంగా విందు ఇచ్చారు. అంతేనా.. ప‌సందైన విందును ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం... విందు వ‌చ్చిన స‌భ్యులంద‌రినీ ల్యాప్‌ టాప్‌ ల‌ను గిఫ్ట్‌ గా ఇచ్చింది. ఈ వ్య‌వ‌హారాన్ని చూస్తే... కేసీఆర్ స‌ర్కారు దుబారాలో ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఒక్కో ల్యాప్ టాప్‌ కు రూ.90వేల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం... స‌భ్యుల‌కు నేరుగా కంప్యూట‌ర్లు ఇవ్వ‌కుండా... వారి చేతిలో రూ.90 వేల విలువ చేసే కూప‌న్ల‌ను పెట్టేసింది. అంటే... స‌భ్యులంద‌రి చేతుల్లో ఈట‌ల వారు రూ.90వేల విలువ చేసే కూప‌న్ల‌ను పెట్టార‌ట‌.

ఈ కూప‌న్ల‌ను తీసుకుని ప్ర‌భుత్వం నిర్దేశించిన ఎల‌క్ట్రానిక్ షాపుల‌కు వెళ్లి వాటిని అంద‌జేస్తే... స‌భ్యుల‌కు ల్యాప్‌ టాప్‌ లు అందుతాయ‌న్న మాట‌. అయినా... రూ.50 వేల లోపే ల‌భించే ల్యాప్‌ టాప్‌ ల కోసం ఏకంగా రూ.90వేలు ఇవ్వ‌డ‌మేంటో అర్థం కాని వ్య‌వ‌హారంలానే క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఉభ‌య స‌భ‌ల్లో ఉన్న మొత్తం స‌భ్యుల సంఖ్య 200ల‌కు పైగానే ఉంది. ఈ మేర‌కు 200 ల్యాప్‌ టాప్‌ ల‌ను బ‌ల్క్‌ గా ఆర్ద‌ర్ చేస్తే... ఏ కంపెనీ అయినా కొంతమేర డిస్కౌంట్ ఇవ్వ‌డ‌మే కాకుండా.,.. ల్యాప్‌ టాప్‌ ల‌ను భ‌ద్రంగా స‌భ్యుల ఇళ్ల‌కు చేర్చేది. ఈ కూప‌న్లు ప‌ట్టుకుని షాపుల‌కెళ్లే స‌భ్యులు... ల్యాప్‌ టాప్‌ లు కొంటారో, లేక ఇంకేమైనా కొంటారో కూడా తెలియ‌కుండానే కేసీఆర్ స‌ర్కారు ఈ కూప‌న్ల‌ను అంద‌జేయ‌డం గ‌మ‌నార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News