కేసీఆర్ వర్గాలవారీ వరాలు

Update: 2016-01-01 22:30 GMT
చిన్న చిన్న బిందువులన్నీ కలిపితే మహా సముద్రం అవుతుందని, గడ్డి పరకలను తాడుగా పేనితే ఏనుగును అయినా బంధించవచ్చనే నానుడి మనకు ఉండనే ఉంది. కేసీఆర్ కూడా ఈ నానుడిని ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు. వర్గాలవారీగా ఒక్కొక్కరికి చిన్న చిన్న వరాలు ఇస్తున్నారు. దాని ద్వారానే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలని కూడా ఆయన అడుగులు వేస్తున్నారు.

జీహెచ్ ఎంసీ పరిధిలో నల్లా - విద్యుత్తు బకాయిలను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వంపై దాదాపు రూ.600 కోట్ల భారం పడుతోంది. కానీ, దీనిద్వారా దాదాపు 8 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఒక్కో ఇంటికి మూడు ఓట్లు ఉంటాయని అంచనా వేసుకున్నా దాదాపు 24 లక్షల ఓట్లు వచ్చేసినట్లే. ఒక ఆస్తి పన్ను మాఫీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1200 లోపు ఆస్తి పన్ను కట్టేవారు రూ.101 కడితే చాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో జీహెచ్ ఎంసీ ఖజానాకు రూ.250 కోట్ల వరకు నష్టం వస్తుంది. కానీ, ఈ నిర్ణయంతో మరో ఐదు లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఇక గ్రూప్ నోటిఫికేషన్ తో దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వానికి సానుకూలంగా మారనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో అత్యధికులు హైదరాబాద్ లోనే ఉన్నారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో వారిలో దాదాపు పాతిక వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దాంతో ఉద్యోగులందరిలోనూ ఒక సానుకూల వాతావరణం రానుంది.

జీహెచ్ ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఒక 400 ఇళ్లు కట్టారు. పది వేల మందికి కట్టిస్తామని హామీ ఇచ్చారు. దాని ఫలితమే లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. వారంతా డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆశలతో అధికార పార్టీకే ఓటు వేసేలా పావులు కదుపుతున్నారు. మొత్తంమీద, ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం ఏ పని చేసినా దాని వెనక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడమనే అంతర్గత సూత్రం దాగి ఉంది.
Tags:    

Similar News