పబ్లిక్ పంక్షన్లో మనమడికి కేకు పెట్టుడేంది కేసీఆర్

Update: 2016-12-21 06:53 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చాలా చిత్రంగా ఉంటుంది. అసలు కంటే కొసరే ముద్దు అన్న సామెతకు తగ్గట్లుగా ఆయన తీరు ఉంటోంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ఆయన.. తన కుటుంబ సభ్యుల్ని.. బంధువుల్ని రాజకీయాల్లో తీసుకొచ్చినా.. బహిరంగంగా వ్యక్తిగత అనుబంధాల్ని అస్సలు తీసుకురారు. ఆ మాటకు వస్తే కన్న కొడుకే కాదు కూతుర్ని కూడా ఒక పార్టీ నేతగానే చూస్తారే తప్పించి.. ప్రత్యేకంగా అస్సలు చూడరు.

దీనికి తగ్గట్లే కేటీఆర్ కావొచ్చు.. కవిత కావొచ్చు.. కేసీఆర్ ను తమ తండ్రి అన్నట్లుగా వారి మాటల్లో ప్రస్తావించరు. పార్టీ అధినేతను ఎంత జాగ్రత్తగా గౌరవంగా.. మర్యాదగా వ్యవహరిస్తారో అదే తీరులో ఉంటారు. పబ్లిక్ ఫంక్షన్లో సైతం.. అంటీముట్టనట్లు ఉంటారే కానీ.. ఒకే ఫ్యామిలీ అన్నట్లుగా అస్సలు కనిపించరు. ఇక.. ప్రముఖులు వచ్చినప్పుడు.. ముఖ్యమైన సమావేశాల్లోనూ కొడుకును.. కూతుర్ని.. మేనల్లుడ్ని ఆకాశానికి ఎత్తేయటం లాంటివి అస్సలు చేయరు.

కొడుకు.. కూతురితో పోలిస్తే.. మేనల్లుడు హరీశ్ ను అప్పుడప్పడు వర్క్ విషయంలో పొగిడేస్తుంటారు. ఆయన సమర్థతను కీర్తిస్తుంటారు. ఈ సందర్భంగా కూడా పార్టీ నేతల్లో ఒకరన్నట్లుగానే ఆయన మాటలు ఉంటాయే కానీ.. తన మేనల్లుడన్నట్లుగా ఆయన ప్రవర్తించరు. వ్యక్తిగత అనుబంధాల్ని రాజకీయాల్లోకి అస్సలు తీసుకురాని ఆయన.. మనమడు (కొడుకు కొడుకు) హిమాన్షు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని చెప్పాలి.

అయుత చండీ యాగం సందర్భంలో కావొచ్చు.. రాష్ట్రపతి ప్రణబ్ నగరానికి వచ్చిన సమయంలో కావొచ్చు.. అంత దాకా ఎందుకు తాజాగా జరిగిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో చూస్తే.. మనమడ్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసే తీరు కనిపిస్తుంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తన వెంట మనమడ్ని తీసుకెళ్లిన కేసీఆర్.. కేక్ కట్ చేసిన సందర్భంగా మనమడి నోట్లో కేకు ముక్క పెట్టి మురిసిపోయారు. కొడుకు.. కూతురు విషయంలో స్పష్టమైన విభజన రేఖను ప్రదర్శించిన ఆయన.. మనమడి విషయంలో మాత్రం అదే తీరులో ఎందుకు వ్యవహరించకుండా ఉంటున్నట్లు? మనమడి మీద ప్రేమను ప్రదర్శించుకోవటానికి.. కేకు ముక్క కట్ చేసి మనమడి నోట్లో పెట్టటానికి పబ్లిక్ ఫంక్షన్ ఎంచుకోవాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న పలువురు నోటి నుంచి వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News