కేసీఆర్ కొత్త ప‌రీక్ష‌తో పార్టీ నేత‌లకు టెన్ష‌న్‌

Update: 2017-08-31 06:51 GMT
టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మంత్రులు - ఎమ్మెల్యేలకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషమ పరీక్ష పెట్టారు. సెప్టెంబర్ 1నుండి ప్రారంభమయ్యే కొత్త పరీక్షను ఎదుర్కొనేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి 40 మాసాలవుతోంది. ఏడాదిలో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రజల మధ్యకు రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు పేరుతో వెత్తే ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆందోళన కొందరిలో ఉంది. అయితే ఎమ్మెల్యేలపై జనం నాడి తెలుసుకునేందుకు, ఇది దోహదపడుతుందన్న చర్చపార్టీలో ఉంది. రైతు కమిటీలను రాజకీయాలకు అతీతంగా వేయడం అన్ని గ్రామాల్లో సాధ్యమయ్యే పని కాదని, ఈ కమిటీల వేదికగా - గ్రూపు తగాదాలు - ఆదిపత్య పోరులు బయటపడే అవకాశం ఉందన్న చర్చ కూడా కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులకు వ్యూహంతో ఉన్న నేతలు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉందని, ఉద్దేశపూర్వకంగా అనుచరులను ఎగదోసే అంశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

కొత్త జిల్లాలు - రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు అనేక సంచలనాత్మక నిర్ణయాలను - విప్లవాత్మక పథకాలను ఇప్ప‌టివ‌ర‌కు ప్రారంభించిన సీఎం కేసీఆర్ దేశంలోనే తొలిసారి రైతు సమన్వయ కమిటీల వ్యవస్థకు - సమగ్ర భూసర్వేకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల ముఖ చిత్రాన్ని ఒడిసిపట్టే ప్రగతికి మార్గం నిర్దేశించే ఈ రెండు కార్యక్రమాలు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చురుకుగా - వ్యూహాత్మకంగా చేయలేకుంటే ఇబ్బందులొస్తాయని భావించిన సీఎం కేసీఆర్ ఇటీవల ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించి మంత్రులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు బాధ్యత అప్పగించారు. ఒక్కో ప్రజాప్రతినిధి మూడు గ్రామాలను యూనిట్‌ గా తీసుకోవాలని చెప్పినా, నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరించే ఎమ్మెల్యేలపైనే సీఎం పెట్టారు. ఈ పధకం విజయవంతమైతే, కమిటీలు పూర్తి అయి భూసర్వే పూర్తయితే...ఇక మీకు తిరుగుండదని సీఎం భరోసానిచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుకు ఇదే గీటురాయిగా భావిస్తానని, డిసెంబర్ దాకా ఎవరూ హైదరాబాద్ రావొద్దని ఈ రెండు పథకాల పని పూర్తయ్యాకే హైదరాబాద్ ముఖం చూడాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లోని రైతులంద‌రినీ సమన్వయం చేయడం - భూ వివాదాలను పరిష్కరించి సర్వేను సమగ్రంగా చేయించడం అంత తేలికగా జరిగే వ్యవహారం కాదని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఇవి రెండూ - సమగ్రంగా జరిగితే - భవిష్యత్‌ లో గ్రామాల్లో సమస్యలు లేకుండా పోతాయని, గ్రామాల ప్రగతి చిత్రంలో గణనీయ మార్పులు వస్తాయని నేతలు ఉదహరిస్తున్నారు.

పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కొందరు ఎమ్మెల్యేలకు గ్రామాల్లోని పార్టీ క్యాడర్‌ తో సన్నిహిత సంబంధాలు లేవు. ఈ పేరుతో వెళ్తే తమ ప్రత్యర్థులు చిక్కులు సృష్టించే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. రైతు కమిటీలకు చాలా ప్రాముఖ్యముందని - ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే అనేకమార్లు విశదీకరించడంతో ఈ పదవులకు గ్రామాల్లో - మండలాల్లో క్రేజ్ ఏర్పడింది. కొందరు రైతులు కాస్ పార్టీనేతలు కూడా కమిటీల పదవుల కోసం టిక్కెట్ రాకుండా చేయాలన్న తహతహలాడుతున్నారు. ఇతర పార్టీల రైతులను ఈ కమిటీలలో సమన్వయం చేసుకోలేకపోతే పలు చోట్ల సమస్యలు ఎదురయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చి గెలిపించుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ నాలుగు నెలలు ప్రజల్లో ఉండండి..ప‌ధ‌కాల‌ను విజయవంతం చేయండి...మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది అంటూనే సమర్థంగా పనిచేసినవారికే టికెట్ల‌ని చెప్పారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌తో నియోజకవర్గాల్లో పోటీ నేతలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ కాళ్లకిందకు నీళ్ళోస్తున్నాయన్న ఆందోళనలో కొందరు ఎమ్మెల్యేలున్నారు.

నూటికి నూరుశాతం సిట్టింగుల‌కు సీట్లు ఇవ్వడం అసాధ్యమని - ఖచ్చితంగా కొందరికి కోత పడుతుందని ఆ కోత పడే జాబితాలో తమ పేర్లు ఉండకూడదంటే ఇపుడు ఒళ్ళ వంచి పనిచేయడమే మార్గమని కొందరు నేతలు చెబుతున్నారు. సీఎం పెట్టిన విషమ పరీక్షను నెగ్గేందుకు నేతలు వ్యూహరచన చేస్తున్నారు, మంత్రులకు సవాలేన‌ని అంటున్నారు. ఇక మంత్రులకూ ఈ రెండు కార్యక్రమాలు సవాలేన‌ని చెప్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయకుంటే జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లోని మంత్రులకు పెద్ద పరీక్షేన‌ని చెప్తున్నారు. దీంతో కార్యక్రమ విజయవంతానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సీఎం పరీక్ష నుండి సేఫ్ కానున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు సీఎం గీసిన గీత దాటకుండా, ఆదేశాలను పాటించి నియోజకవర్గాలకే అంకిత‌మ‌వుతున్నారు.
Tags:    

Similar News