ఎంపీల‌కు..ఎమ్మెల్యేల‌కు షాకిస్తున్న కేసీఆర్‌

Update: 2017-06-24 06:15 GMT
రౌతు మెత‌గ్గా ఉంటే గుర్రం మూడు కాళ్ల మీద న‌డుస్తుంద‌ని ఊరికే చెప్ప‌లేదు. కాస్త అలుసు ఇస్తే.. మొత్తంగా వాడేసే నేత‌ల విష‌యంలో అధినేత‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. కానీ.. ఇలాంటి వాటి విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ట్లు చెబుతున్నారు. నేత‌లు రాజ‌కీయాలు చేయ‌టం ఓకే కానీ.. ఆ పేరిట రాజ‌కీయ పైర‌వీల కోసం త‌న చుట్టూ తిరిగే వారికి త‌న‌దైన శైలిలో షాకిస్తున్న‌ట్లు చెబుతున్నారు. చివ‌ర‌కు పార్టీకి చెందిన కొంద‌రు ఎంపీలు.. ఎమ్మెల్యేల‌కు సైతం వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ప్ర‌భుత్వం ఏర్పాటైన కొత్త‌ల్లో ప‌నుల చేయించుకోవ‌టం కోసం వ‌చ్చే ఎంపీలు.. ఎమ్మెల్యేల విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ ఈ మ‌ధ్య‌న ప‌నుల విష‌యంలో లోతుగా చూస్తున్న‌ట్లు స‌మాచారం. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఒక‌ట్రెండు ప‌నుల కోసం రావ‌టం త‌ప్పు లేద‌ని.. కానీ అదే ప‌నిగా ప‌నుల కోసం వ‌స్తూ.. నిత్యం త‌న నివాసం ద‌గ్గ‌రే త‌చ్చాడే నేత‌ల‌కు క్లాస్ పీకిన‌ట్లుగా స‌మాచారం. పైర‌వీల‌తో బండి లాగించే వారికి త‌న‌దైన శైలిలో ఆయ‌న షాక్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

పైర‌వీల విష‌యంలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌కుండా అన్ని విధాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొంద‌రి విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొద‌ట్లో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప‌నుల గురించి అడిగిన వారికి నో అన‌కుండా చేసి పెట్టిన ఆయ‌న‌. ఇటీవ‌ల కాలంలో ఇలాంటి వాటికి దాదాపు చెక్ పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ప‌నుల కోసం వ‌చ్చే వారికి సంబంధించిన స‌మాచారాన్ని తెచ్చి పెట్టుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆ మ‌ధ్య‌న ఒక ఎమ్మెల్యే త‌ర‌చూ వ‌చ్చి బ‌దిలీల ఫైళ్ల‌పై సంత‌కాలు పెట్టించుకునే వార‌ని.. దీనిపై సందేహం వ‌చ్చిన సీఎం.. లోతుగా దృష్టి పెడితే.. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారి బ‌దిలీల మీద స‌ద‌రు ఎమ్మెల్యే ఫోక‌స్ పెడుతున్న‌ట్లుగా గుర్తించారు. వెనువెంట‌నే.. ఆ ఎమ్మెల్యేకు త‌న అపాయింట్ మెంట్‌ ను క‌ట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

పైర‌వీల కోసం వ‌చ్చే పార్టీ ఎంపీ.. ఎమ్మెల్యేల విష‌యంలో కేసీఆర్ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. రాజ‌కీయం కావాలా? వ్యాపారాలు కావాలా? అంటూ సూటిగా అడుగుతూ నేత‌ల నోట మాట రాకుండా చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. రాజకీయ అవినీతి విష‌యంలో సీరియ‌స్ గా ఉన్న కేసీఆర్‌.. ఆ విష‌యంలో తోక జాడిస్తున్న వారిని క‌లుసుకునేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని.. అలాంటి వారి అపాయింట్ మెంట్స్‌ను  క‌ట్ చేయ‌టానికి సైతం సందేహించ‌టం లేద‌ని చెబుతున్నారు.

త‌ర‌చూ సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద త‌చ్చాడే నేత‌ల‌కు కేసీఆర్ ఈ మ‌ధ్యన ఝుల‌క్ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. త‌న ముంద‌స్తు అపాయింట్ మెంట్ లేకుండా ప్ర‌గ‌తి భ‌వ‌న్ రావొద్ద‌ని.. అయినా క్యాంప్ కార్యాల‌యం వ‌ద్ద ఉండాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని ప‌లువురునేత‌ల్ని ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఉండి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద దృష్టి పెట్టాల్సింది పోయి.. పైర‌వీల కోసం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తే బాగోద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News