న్యూఇయ‌ర్ రోజున సీమాంధ్రుల‌కు కేసీఆర్ షాక్‌

Update: 2018-01-01 08:26 GMT
విభ‌జ‌న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పినంత బాగా మ‌రెవ‌రూ చెప్ప‌లేరు. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న ఉద్య‌మం నాటి మాట‌ల‌కు భిన్నంగా  తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత నుంచి కేసీఆర్ తానేమిటో చేత‌ల్లో చేసి చూపించారు. కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే వ్య‌క్తి అలా ఉండ‌టం త‌ప్పేం కాదు.

మీరు వేరు.. మేం వేరు. మీ సంప్ర‌దాయం.. సంస్కృతి..  క‌ట్టుబొట్టు..  యాస‌.. గోస ఇలా చెప్పుకుంటూ పోతే దేన్లోనూ మీతో మాకు సంబంధం లేదు. మీరు వేరు.. మేం వేరు అని ఇప్ప‌టికే ఒక‌టికి వంద‌సార్లు తేల్చిచెప్పేశారు. ఏ యాంగిల్ లో చూసినా.. ఆంధ్రా.. తెలంగాణ‌కు సంబంధం లేద‌ని.. మీతో మాకు సంబంధం లేద‌న్న‌ట్లుగా తేల్చేశారు.

ఎంత చెడ్డా.. రెండు ప్రాంతాల వారు ఇన్నేసి ఏళ్లు క‌లిసి ఉన్నారు క‌దా.. సుఖం.. దుంఖంలో కాస్త పాలు పంచుకుందామ‌న్న మాట అంటే కయ్య‌న లేచే కేసీఆర్‌.. ఏం ఇంత‌కాలం మ‌మ్మ‌ల్ని దోచుకున్న‌ది స‌రిపోదా? ఈ మాయ మాట‌లు చెప్పి మ‌ళ్లీ దోచుకుందామ‌ని ప్లాన్ చేస్తున్నారా? అంటూ తిట్ల దండ‌కం అందుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల మ‌ధ్య అడ్డుగోడ‌లు అంత‌గా ఉండ‌వ‌ని అనుకున్న వారి అంచ‌నాల‌కు భిన్నంగా భారీగా గోడ‌లు క‌ట్టేశారు. ఎక్క‌డి దాకానో ఎందుకు.. తెలుగు దిన‌ప‌త్రిక‌లు తెలంగాణ వార్త‌లు తెలంగాణ‌కు.. ఏపీ వార్త‌లు ఏపీకి ప‌రిమితం చేయ‌టం.. చాలా ప్రాధాన్య‌త ఉన్న వార్త‌లు మిన‌హా మ‌రేమీ అచ్చేయ‌ని ప‌రిస్థితి.

ఎందుకంటే.. తెలంగాణ‌కు ఆంధ్రా వార్త‌లు ఎందుకు? ఆంధ్రా వార్త‌లు తెలంగాణ‌కు ఎందుకు? అని అడిగేసే ప‌రిస్థితికి వ‌చ్చేసింది.మ‌రి.. ఇంత‌లా చీలిపోయిన తెలుగు నేల మీద.. ఈ రోజు కేసీఆర్ చేసిన ప‌ని చాలామందికి అర్థం కాని రీతిలో మారింది.

ఈ రోజు నుంచి తెలంగాణ‌లోని రైతాంగానికి నిరంత‌రాయంగా 24 గంట‌ల పాటు నాణ్య‌మైన విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్న‌ట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన భారీ ప్ర‌క‌ట‌న‌ను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప‌త్రిక‌ల్లో మొద‌టి పేజీల్లో మొత్త‌గా అచ్చేయించారు. ఆస‌క్తిక‌రంగా తెలుగులో అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ ఉన్న ఈనాడు ఏపీ ఎడిష‌న్ లోనూ మొద‌టి పేజీ మొత్తంగా అచ్చేయించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

కొత్త సంవ‌త్స‌రం రోజున‌.. పొద్దు పొద్దున్నే సీమాంధ్రుల్ని తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వ్వుతూ ప‌లుక‌రించే వైనం ఏపీ ప్ర‌జ‌ల‌కు షాకింగ్ గా మారుతుంద‌నే చెప్పాలి.

విడిపోయాక మేం సాధించిన భారీ విజ‌యం ఇదిగో అన్న‌ట్లు ఏపీ ప్ర‌జ‌ల్ని గిల్లిన‌ట్లుగా స‌ద‌రు ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వార్త‌ల విష‌యంలో.. ఏపీ వార్త‌లు తెలంగాణ‌లో ఎందుకు?  తెలంగాణ వార్త‌లు ఏపీలో ఎందుకు? అని ప్ర‌శ్న‌లు వేసే వార్తా ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలు ఒక రాష్ట్రానికి చెందిన ప్ర‌క‌ట‌న‌లు మ‌రో ప్రాంతంలో ఎందుకు అచ్చేస్తార‌న్న ప్ర‌శ్న‌ను మాత్రం వేసుకోవటం క‌నిపించ‌దు. త‌మ రాష్ట్రానికి చెందిన రైతుల‌కు ఇచ్చిన వ‌రాన్ని ఏపీలో కేసీఆర్ ఎందుకు ఘ‌నంగా చాటుకున్న‌ట్లు?

దీనికి కార‌ణం లేక‌పోలేదు. విభ‌జ‌న వేళ లోటులో ఉన్న విద్యుత్ స‌మ‌స్య‌ను త‌మ ఏలుబ‌డిలో ఉన్న ప్ర‌భుత్వం ఎంత‌లా అధిగ‌మించింద‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. విభ‌జ‌న వేళ‌కు మిగులు విద్యుత్ ఉన్న ఏపీతో పోలిస్తే తామెంత‌గా అభివృద్ధి ప‌థంలోకి దూసుకెళుతున్నామ‌న్న విష‌యాన్ని చెప్పేశార‌ని చెప్పాలి. కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. పొద్దుపొద్దున్నే ఏపీ ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌మంది త‌మ సోద‌ర రాష్ట్రాన్ని చూసి ఆసూయ‌ప‌డేలా చేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News