ఆ ఇద్ద‌రికి కేసీఆర్ మార్క్ ఝుల‌క్‌..!

Update: 2019-09-09 05:27 GMT
రాజ‌కీయాల్లో గులాబీద‌ళ‌ప‌తి - ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్టైలే వేరు. ఆయ‌న వ్యూహాలు అంత‌ సుల‌భంగా అంచ‌నాల‌కు అంద‌వు. ఆయ‌న వేసే అడుగులు ప్ర‌త్య‌ర్థుల్లోనే కాదు.. సొంత పార్టీ నేత‌ల్లోనూ ద‌డ‌పుట్టిస్తాయి. ఎప్పుడు ఎవ‌రికి ఎలా చెక్ పెడుతారో.. ఎప్పుడు ఎవ‌రిని అంద‌లం ఎక్కిస్తారో ఎవ్వ‌రికీ అంతుచిక్క‌దు. ఇలా టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం.. అంటే 2001 నుంచి ఎంద‌రో హేమాహేమీలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ప్ర‌త్య‌ర్థుల‌కేకాదు.. సొంత‌పార్టీ నేత‌ల‌కు కూడా షాక్ ఇవ్వ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పొచ్చు. తాజాగా.. జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ ప‌లువురు సీనియ‌ర్ల‌కు సీఎం కేసీఆర్ త‌న‌దైన మార్క్ రాజ‌కీయంతో షాక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు - ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌ కు చెందిన క‌డియం శ్రీ‌హ‌రిలతోపాటు ప‌లువురు నేత‌ల‌ ఆశ‌య‌లు అడియాశ‌ల‌య్యాయి. గ‌త ప్ర‌భుత్వంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కేసీఆర్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఆయ‌న పాలేరు నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. అయితే.. కేసీఆర్‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాల నేప‌థ్యంలో తుమ్మ‌ల‌ను ఎమ్మెల్సీ చేసి - మ‌ళ్లీ మంత్రిని చేస్తార‌నే టాక్ బ‌లంగా వినిపించింది. నిజానికి.. తుమ్మ‌ల కూడా ఇదే న‌మ్మ‌కంతో ఉన్న‌ట్టు తెలిసింది. కానీ.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. దీంతో మంత్రివ‌ర్గంలోనూ ఆయ‌న‌కు చోటుద‌క్క‌లేదు.

దీంతో ఖ‌మ్మం జిల్లాలో తుమ్ముల రాజ‌కీయ భ‌విష్య‌త్‌ పై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని గులాబీ శ్రేణుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ముందుముందు తుమ్ముల‌కు మ‌రేదైనా కీల‌క ప‌ద‌వి అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని - ఆ క‌బురు కూడా ఆయ‌న త్వ‌ర‌లోనే వింటార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన కీల‌క నేత క‌డియం శ్రీ‌హ‌రి కూడా కొంత అసంతృప్తికి లోనైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ప్రభుత్వంలో ఆయ‌న డిప్యూటీ సీఎంగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. అయితే.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌నే ఆశ‌తో ఆయ‌న ఉన్నారు. కానీ.. అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో క‌డియం నిరుత్సాహానికి గురైన‌ట్లు తెలుస్తోంది.

అయితే.. మ‌రికొద్ది రోజుల్లోనే క‌డియంకు కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపిక‌బురు వినిపిస్తార‌ని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఆయ‌న స్థాయికి ద‌గ్గ ప‌ద‌వే కేసీఆర్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు.. చాలా రోజులుగా క‌డియం బీజేపీ వైపు చూస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని క‌డియం ఖండించినా ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. ఇప్పుడు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో..మ‌రోసారి ఈ ప్ర‌చారం ఊపందుకుంటోంది.



Tags:    

Similar News