కొత్తవారొస్తే పాతవారి సంగతి అంతేనా..?

Update: 2015-07-03 04:50 GMT
అవకాశం ఉన్నప్పుడు పార్టీని వీలైనంత బలోపేతం చేయాలన్న భావన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కీలక నిర్ణయాల్ని తీసుకోనున్నారని చెబుతున్నారు.

తెలంగాణ అధికార పక్షంలో ఇప్పటికే చేరిన నేతలతో పాటు.. తాజాగా మరోసారి పలువురు నేతలు అధికారపార్టీ ''కారు'' ఎక్కేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి తగినన్ని పదవులు ఇచ్చేందుకు వీలుగా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇందుకోసం పాత వారిని త్యాగాల పేరిట బలి చేసే కార్యక్రమం ఒకటి షురూ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డి శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ముహుర్తం నిర్ణయించుకోవటం తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు.. మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు కేసీఆర్‌ ఓకే చెప్పారని చెబుతున్నారు.

డి శ్రీనివాస్‌తో పాటు పలువురు నేతలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో.. అలా వచ్చే వారిలోకొందరికి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి.. పదవుల సర్దుబాటు కేసీఆర్‌ ఎలా చేస్తారన్న దానికి.. తాజాగా తనను కలిసి మంత్రులు కొందరి వద్ద కేసీఆర్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. కొత్తవారికి పదవులు ఇవ్వాలంటే పాత వారికి పదవుల నుంచి తీసివేయక తప్పదన్నట్లుగా చెప్పినట్లు పేర్కొంటున్నారు.

కేసీఆర్‌ నోటి నుంచి పదవుల బదిలీ మాట వచ్చినప్పటి నుంచి తెలంగాణ మంత్రుల్లో కొత్త దిగులు మొదలైంది. వారంతా టెన్షన్‌కు గురి అవుతున్నారు. అయితే మార్పులు చేర్పులు వెనువెంటనే జరగనప్పటికీ.. రెండు.. మూడు నెలల్లో మాత్రం ఖాయంగా ఉంటుందని చెబుతున్నారు. కొత్త నీరు వచ్చేటప్పుడు పాత నీరు పక్కకు తప్పుకోవాల్సిందేగా.

Tags:    

Similar News