మూడు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్.. జగన్ ను పిలవలేదా?

Update: 2023-01-18 08:56 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం ఖమ్మంలో జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు హాజరయ్యే మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో అల్పాహార విందులో సమావేశమయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డిఎ రాజా, ఇతర నేతలు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. బీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసానికి చేరుకున్న అతిథులకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు అందించి స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ చీఫ్ మూడు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ఇతర నేతలతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర నేతలతో కలిసి యాదగిరిగుట్టకు బయల్దేరి వెళ్లారు. వీరి వెంట తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. యాదగిరిగుట్టలో దిగిన అనంతరం నేతలంతా పునరుద్ధరించిన ఆలయంలోని ప్రెసిడెన్షియల్ సూట్ వద్దకు వెళ్లారు. అనంతరం ఆలయాన్ని సందర్శించిన వారికి పూజారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

-  జగన్‌కి కేసీఆర్‌ ఆహ్వానం కూడా లేదా?
 
బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం తొలి సమావేశం ఇవాళ ఖమ్మంలో జరగనుంది. ఈ సభకు ఐదు లక్షల మందిని తరలిరావాలని కేసీఆర్ భారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది జాతీయ స్థాయిలో కేసీఆర్ బల నిరూపణ అవుతుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించారు. పొరుగునే ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు వ్యతిరేకులైన బీజేపీ, కాంగ్రెస్‌ శిబిరంలో లేనప్పటికీ ఆయనకు కేసీఆర్ ఆహ్వానం లేకపోవడం గమనార్హం.

తన కేసుల్లో ఇబ్బందులు వస్తాయనే భయంతో జగన్ గతంలో బీజేపీతో రహస్యంగా దోబూచులాడుతున్నందున కేసీఆర్‌పై విశ్వాసం నింపలేకపోయి ఉండవచ్చని ప్రచారం సాగుతోంది. విభజన హామీలన్నింటిపై జగన్ ఇప్పటికే రాజీపడ్డారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం.. బీజేపీతో పోరాడటానికి జగన్ సహాయం చేస్తారని కేసీఆర్ ఆశించడం లేదు. కుమారస్వామి, స్టాలిన్, మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కుమారస్వామి మరియు స్టాలిన్‌లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మమత కూడా థర్డ్ ఫ్రంట్  సంకీర్ణంలో భాగం కావడానికి ఇష్టపడలేదు. అలాగే ఆమె కమ్యూనిస్టులు ఉన్న సంకీర్ణంలో భాగం కాలేరు. జేడీయూ నితీష్ కుమార్ తన ఆప్షన్‌లను తెరిచి ఉంచుతున్నారు. సో ఇలా కేసీఆర్ తోపాటు ప్రస్తుతానికి ముగ్గురు సీఎంలు కొందరు కీలక నేతలు మాత్రమే ఉన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News