మార్కెట్లు.. బజార్లు కిటకిట: లాక్ డౌన్ వార్తతో హైదరాబాద్ వాసుల అలర్ట్

Update: 2020-06-29 11:10 GMT
హఠాత్తుగా హైదరాబాద్ లో ఆదివారం మధ్యాహ్నం నుంచి రైతు బజార్లు.. సూపర్ మార్కెట్లు.. కిరాణ దుకాణాలు కిటకిటలాడాయి. సాయంత్రానికి ప్రజల రద్దీ పెరిగి దుకాణాల ఎదుట వరుసలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం మరింత క్యూలైన్లు పెరిగాయి. లాక్ డౌన్ విధిస్తారని వార్తలు గుప్పుమనడంతో భాగ్యనగరవాసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున సరుకులు.. కిరాణ సామగ్రి.. ఇతర వస్తువులు కొనుగోలు చేశారు.

తెలంగాణలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఒక్క హైదరాబాద్ పరిధిలో కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రభుత్వం నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైరస్ కట్టడి చర్యలపై ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు.. అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఏం చేద్దాం.. ఎలా వైరస్ ను కట్టడి చేద్దామని సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో మరోసారి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై విస్తృత చర్చ జరిగింది. రెండు.. మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వార్తలు మీడియాలో రావడంతో హైదరాబాద్ వాసులు అప్రమత్తమయ్యారు. లాక్ డౌన్ విధిస్తారని భావించి ముందే నిత్యావసర వస్తువులు.. సరుకులు కొనుగోలు చేశారు.

ఆదివారం సాయంత్రం, సోమవారమంతా దుకాణాలు.. మార్కెట్లు.. బజార్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కర్నాటకలో ప్రతి ఆదివారం.. తమిళనాడులోని చెన్నైలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా విధిస్తారని భావించి ప్రజలు ముందు జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించే విషయం రెండు రోజుల్లో స్పష్టత రానుంది. అయితే లాక్ డౌన్ కు బదులు ప్రభుత్వం టెస్టులు పెద్దసంఖ్యలో చేయాలని కోరుతున్నారు. ఇంటింటికి పరీక్షలు చేస్తే కేసులు వెంటనే బయటపడతాయని.. అనంతరం నివారణ చర్యలు అమలు చేయాలని చెబుతున్నారు. లాక్ డౌన్ విధిస్తే ప్రయోజనం ఉండదని.. టెస్టులు పెంచడమే వైరస్ చెయిన్ కట్ చేయడానికి దోహదం చేస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News