మెట్రో ముహుర్తం ఫిక్స్‌.. మోడీకి ఇన్విటేష‌న్‌

Update: 2017-09-07 09:40 GMT
హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రోరైల్ ప‌ట్టాలకెక్క‌నుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. మెట్రో ఫేజ్ 1 లో భాగంగా నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కున్న 30 కిలోమీట‌ర్ల మార్గాన్నిప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు.

దీనికి సంబంధించిన ఇన్విటేష‌న్ ను నిన్న (బుధ‌వారం) ప్ర‌ధాని మోడీకి పంపిన‌ట్లుగా తెలియ‌జేసే లేఖ‌ను కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ పేరిట ఉన్న ఈ లేఖ‌లో మోడీని మెట్రో రైల్‌ ను ప్రారంభించటానికి రావాల్సిందిగా కోర‌టం క‌నిపిస్తుంది. తాను మే నెల‌లోనే (25-05-2017) వ్య‌క్తిగ‌తంగా మెట్రో రైల్ ప్రారంభానికి ఆహ్వానించాన‌న్న విష‌యాన్ని గుర్తు చేసిన కేసీఆర్‌.. న‌వంబ‌రు 28-30 తేదీల్లో హైద‌రాబాద్ లో జ‌రిగే గ్లోబ‌ల్ ఎంటర్ ప్రెన్యూర్స్ స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతున్న నేప‌థ్యంలో మెట్రో రైలును ప్రారంభించాల‌ని కోరారు. గ‌తంలోనే మెట్రోరైలు ప్రారంభానికి మోడీ ఒప్పుకున్నందున‌.. న‌వంబ‌రు 28న న‌గ‌రంలోనే ఉంటున్న నేప‌థ్యంలో మెట్రో రైల్‌ ను ప్రారంభించాల‌న్నారు.

ప్రైవేటు- ప‌బ్లిక్ భాగ‌స్వామ్యంలో దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా మెట్రో రైలుకు పేరుంద‌ని.. రూ.15వేల కోట్ల ఖ‌ర్చుతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న‌ట్లుగా త‌న లేఖ‌లో కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించాలంటూ ప్ర‌ధాని మోడీకి కేసీఆర్ పేరిట లేఖ‌ను పంపారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ లేఖ‌ను త‌యారు చేసిన తేదీన (నిన్న‌.. బుధ‌వారం 06-09-2017) ఢిల్లీలో కేసీఆర్ త‌న‌ కంటికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకుంటే.. ప్ర‌ధాని మోడీ మ‌య‌న్మార్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంగ‌తి ఎలా ఉన్నా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు రిలీజ్ డేట్ అధికారికంగా వ‌చ్చేసిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News