ఫ్యీడ్ బ్యాక్ కోసం కేసీఆరే ఫోన్ చేస్తున్నారు

Update: 2015-08-19 05:43 GMT
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఎప్పటికప్పుడు.. ఏం జరుగుతుందన్న విషయం మీద సమాచారం సేకరిస్తుంటారు. ప్రభుత్వాధినేతలైతే.. నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తుంటాయి. అయితే.. అవిచ్చే సమాచారం మీద ఎంతోకొంత సందేహంతో సొంత వాళ్ల చేత సమాచారం సేకరించుకోవటం మామూలే. తాజాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి మరింత ముందుకెళ్లినట్లుగా కనిపిస్తోంది.

ఆ మధ్య హైదరాబాద్ లోని పారిశుద్ధ్య సమస్య మీద కాలనీ అధ్యక్షులతో నేరుగా మాట్లాడిన కేసీఆర్.. తాజాగా తాను స్టార్ట్ చేసిన గ్రామజ్యోతి కార్యక్రమం మీద ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం తెలుసుకోవటానికి స్వయంగా తానే ఫోన్ చేయటం ఆసక్తికరంగా మారింది.

వరంగల్ జిల్లా గంగదేవిపల్లి లో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత.. అదే రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో.. గంగదేవిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కూసం రాజమౌళి కే ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేశారు. రాజమౌళి ఫోన్ కి ఫోన్ చేసిన కేసీఆర్.. తనకు తాను పరిచయం చేసుకోవటంతో అవతలి వ్యక్తి నోట మాట రాని పరిస్థితి. ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ చేయటంతో ఆనందంతో ఉబ్బితబుబ్బి పోయిన ఆయన్ను గ్రామజ్యోతి కార్యక్రమం ఏ విధంగా జరిగింది? దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

దీనికి సదరు గ్రామ అధ్యక్షుడు కార్యక్రమం బాగా జరిగిందని.. ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఫోన్ చేస్తే.. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిందని చెప్పక.. అసలు విషయాలు చెప్పేస్తారా ఏంటి? అయినా.. సన్నిహితులు.. పార్టీ క్యాడర్ ఇంత భారీగా ఉన్నా.. ముఖ్యమంత్రే స్వయంగా ఫీడ్ బ్యాక్ కోసం ఫోన్ చేయటమేమిటబ్బా..?
Tags:    

Similar News