గంట భేటీలో... మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడారంటే?

Update: 2019-10-05 04:40 GMT
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఢిల్లీ పర్యటనలో శుక్రవారం బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసమే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్... పీఎంతో బేటీకి ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఆ తర్వాత శుక్రవారం నేరుగా ప్రధాని వద్దకు వెళ్లిన కేసీఆర్... మోదీతో గంటకు పైగా సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో వరుసగా రెండో పర్యాయం కూడా ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోదీకి కేసీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఝతలు తెలిపారు. ఆ తర్వాత తెలంగాణకు కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై కేసీఆర్ సుదీర్ఘంగానే మోదీతో చర్చించారు.

ఈ చర్చల్లో భాగంగా కేసీఆర్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు - కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు అంశాలను ప్రధానితో ఆయన చర్చించినట్టు సమాచారం. మిషన్‌ భగీరథ పథకానికి కూడా నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ములుగు - నారాయణపేట్‌ జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి మార్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మార్పులకు అనుగుణంగా జోనల్‌ ఉత్తర్వులను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని కోరినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే... దాదాపుగా గంటకు పైగానే ప్రధానితో భేటీ అయిన కేసీఆర్... ఆ తర్వాత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. 15 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో కేసీఆర్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూముల అప్పగించాలని రాజ్‌నాథ్‌ను  కేసీఆర్ కోరారు. సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ భూములకు సంబంధించి కేంద్రం, తెలంగాణల మధ్య చాలా కాలం నుంచి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన డిల్లీ పర్యటనలో ఈ వివాదానికి తెర పడేలా కేసీఆర్... రాజ్ నాథ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. అటు అమిత్ షా - మోదీ - ఇటు రాజ్ నాథ్ తో భేటీలను ముగించుకున్న కేసీఆర్ శుక్రవారం రాత్రికే  హైదరాబాద్‌ కు తిరుగుప్రయాణమయ్యారు.


Tags:    

Similar News