అదిరిపోయే ముహుర్తంలో కొత్త జిల్లాల జీవో

Update: 2016-10-09 17:23 GMT
సంఖ్యాశాస్త్రం.. వాస్తు లాంటి అంశాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న నమ్మకం ఎంతన్నది అందరికి తెలిసిందే. ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు తన నమ్మకాలకు తగినట్లుగా అన్ని సరిపోయేలా ఉన్నాయా? లేదా? అన్నది చెక్ చేసుకోవటం కేసీఆర్ కు అలవాటు. నిజానికి ఆయన చేసే పనులకు మాత్రమే కాదు.. తనకు తెలిసిన వారికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటుంటే..తానే కలుగజేసుకొని మరీ సలహాలు ఇచ్చే వైనం ఆయనలో ఉందని చెబుతుంటారు.

ఎక్కడిదాకానో ఎందుకు.. ఏపీ రాజధాని అమరావతి అని డిసైడ్ చేయకముందు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో ఏ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందో చెప్పటం మర్చిపోలేం. అలాంటి కేసీఆర్.. దాదాపు ఏడాదిగా కసరత్తు చేస్తున్న కొత్త జిల్లాల ప్రారంభానికి సంబంధించిన ముహుర్తంపై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ జీవో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకిలా అంటే రెండు కారణాలుగా చెబుతున్నారు. అందులో ఒకటి.. ప్రభుత్వ పరంగా న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా అన్నది ఒకటి. అయితే.. ఈ వాదన తర్కానికి అనుగుణంగా లేదని చెప్పాలి. ఇక.. రెండో కారణం.. మంచి ముహుర్తం ఉండటం. ఆ వాదన నిజమేనా? అన్నది చెక్ చేస్తే.. నిజమేనని చెప్పక తప్పదు. సోమవారం అర్థరాత్రి 12.19 గంటలకు (అంటే.. మంగళవారం) మూఢం వెళ్లిపోనుంది.

అప్పటిదాకా ఉండే నవమి వెళ్లిపోయి దశమి వస్తుంది. అంతేకాదు.. ఉత్తరాషాడ వెళ్లి శ్రావణా నక్షత్రం అడుగు పెడుతుంది. సోమవారం అర్థరాత్రి 12.20 గంటల నుంచి 2.24 గంటల మధ్య కర్కాటక లగ్నంలో బ్రహ్మాండమైన ముహుర్తం ఉందని.. ఆ సమయంలోనే కొత్త జిల్లాలకు సంబంధించిన జీవోలు విడుదల అవుతాయని చెబుతున్నారు. అంటే.. జీవో జారీకి సోమవారం అర్థరాత్రి 12.21 నుంచి 2.23 గంటల మధ్యనే కొత్త జిల్లాల నోటిఫికేషన్ ను విడుదల చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News