త‌క్కువ అంచ‌నా వేసి కేసీఆర్ భారీ త‌ప్పు చేస్తున్నారా?

Update: 2019-06-28 04:47 GMT
కొన్ని విష‌యాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అదే ఆయ‌న కొంప ముంచేస్తుంటుంది. కాకుంటే ఆయ‌న‌కున్న అదృష్ట‌మా అని ఆయ‌న తిన్న ఎదురుదెబ్బ‌ల్ని మ‌ర్చిపోయేలా ఏదో ఒక విజ‌యం ఆయ‌న ఖాతాలో చేరుతుంది. దీంతో.. అంత‌కు ముందు ప‌రాజ‌యం ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోర‌ని చెబుతారు. దీనికి చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణగా ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌గిలిన భారీ షాక్ ను చెప్పాలి. అయితే.. దాన్ని లెక్క‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదన్న‌ట్లుగా ఆ వెంట‌నే వెలువ‌డిన స్థానిక ఎన్నిక‌ల ఘ‌న విజ‌యం తేల్చేసింది.

దీనికి త‌గ్గ‌ట్లే కేసీఆర్ సైతం సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ‌కు త‌గిలిన ఎదురుదెబ్బ‌ను లైట్ తీసుకొని మ‌ర్చిపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గులాబీ ప‌రివారం త‌మ స‌త్తా చాటాల‌న్న ఫ‌ర్మానా జారీ చేయ‌టంతో పాటు.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేసీఆర్ కోరుకున్నంత కాకున్నా.. త‌న అధిక్య‌త‌ను నిలుపుకోవ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న క్యాడ‌ర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు వీలుగా బీజేపీని చిన్న‌బుచ్చేలా మాట్లాడిన కేసీఆర్ తాజా వ్యాఖ్య‌లు తొంద‌ర‌పాటుగా చెప్ప‌క త‌ప్ప‌దు. బ‌య‌టోళ్లు ఏదేదో చెబుతున్నార‌ని.. తెలంగాణ‌లో త‌మ‌కు తిరుగులేద‌ని.. త‌మ‌ను రాజ‌కీయంగా దెబ్బ తీసే వారే ఎవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

రాష్ట్ర ప్ర‌జ‌లంతా త‌మ‌వైపే ఉన్నార‌ని.. బీజేపీ వారి మాట‌ల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

మొత్తం 8 జ‌డ్పీటీసీలు కూడా లేని బీజేపీ మ‌న‌కు పోటీనా? అంటూ సింఫుల్ గా తేల్చేస్తున్న కేసీఆర్ తీరు స‌రికాదంటున్నారు. బీజేపీ అధినాయ‌క‌త్వం ఒక్క‌సారి ఫోక‌స్ చేస్తే.. స‌ద‌రు రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరే వ‌ర‌కూ వెన‌క్కి చూడ‌ని త‌త్వం  వారి సొంత‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి క్లిష్ట‌మైన రాష్ట్రంలోనే కాషాయ‌జెండా రెప‌రెప‌లాడేలా చేసిన బీజేపీ ప‌రివారానికి తెలంగాణ రాష్ట్రం పెద్ద విష‌యం కాదు. దీనికి తోడు కేసీఆర్ పాల‌న‌పై ఇప్ప‌టికే ప‌లు ప‌క్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

మాట‌లే కాదు చేత‌ల్లేని సీఎం అంటూ మండిప‌డే వారు ఎక్కువ అవుతున్నాయి. జ‌మిలి ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బీజేపీని టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా త‌యారు చేయాల‌న్న యోచ‌న‌ను కేసీఆర్ గేలి చేయ‌టం త‌ప్పేనంటున్నారు. ప్ర‌త్య‌ర్థి ఎంత‌టోడైనా స‌రే.. చిన్న‌పాము పెద్ద క‌ర్ర సామెత‌ను కేసీఆర్ లాంటోడు మ‌ర్చిపోవ‌టం ఏమిట‌న్న మాట కొంద‌రి నోటి నుంచి వినిపిస్తోంది. కారు.. ప‌ద‌హారు అంటూ అట్ట‌హాసంగా ప్ర‌చారం చేసి.. అంతులేని కాన్ఫిడెన్స్ ను ప్ర‌ద‌ర్శించిన దానికి భిన్నంగా తెలంగాణ ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇచ్చారో చూసిందే.

ఏదైనా రాష్ట్రంలో తాము పాగా వేయాల‌ని భావిస్తే.. ఆ రాష్ట్రాన్ని త‌మ గ్రిప్ లో పెట్టుకోవ‌టానికి మోడీషాలు ఎంత‌కైనా రెఢీ అవుతార‌న్న విష‌యాన్ని కేసీఆర్ మ‌ర్చిపోవ‌టం ఏమిటంటున్నారు. ఇప్ప‌టికైనా మునిగిపోయిందేమీ లేద‌ని.. తెలంగాణ‌పై క‌న్నేసిన క‌మ‌ల‌నాథుల్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌టం మానేసి.. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. ఈ విష‌యంలో ఏ మాత్రం త‌ప్పు జ‌రిగినా గులాబీ బాస్ భారీగా మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.
Tags:    

Similar News