కీలకభేటీకి డుమ్మా కొట్టి అందరి కంట్లో పడిన కేసీఆర్

Update: 2019-08-27 04:58 GMT
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కేంద్రంలో కోరి తలనొప్పులు తెచ్చుకోవటానికి ఎవరూ సాహసించని పరిస్థితి. మోడీ సర్కార్ ఎడ్డెం అంటే తెడ్డెం అనే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం కాస్తంత తగ్గి.. తాజాగా మావో సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సమావేశానికి ఢిల్లీకి వచ్చి బుద్దిగా హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరు కావటం హాట్ టాపిక్ గా మారింది.

మావో సమస్యను ఎదుర్కొనే రాష్ట్రాలతో షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. ఈ సమస్యను తీవ్రంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ తరఫున హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ రాకపోవటం అందరిని ఆశ్చర్యపోయేలా చేయటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. మోడీ సర్కారుతో తనకున్న గ్యాప్ ను మరింత పెంచేలా కేసీఆర్ తాజా వ్యవహార శైలి ఉందన్న మాట వినిపిస్తోంది. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు పలువురు హాజరైన కీలక సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టటం అర్థం లేదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం.

రాష్ట్ర ప్రయోజనాల వేళ.. వ్యక్తిగత రాజకీయాల కోసం కీలక సమావేశానికి రాకుండా ఉండటం ఏమిటన్న చర్చ కూడా నడిచినట్లు తెలుస్తోంది.పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరు కాగా.. కేసీఆర్ రాకపోవటం ఏమిటన్న వాదన తెర మీదకు వచ్చింది. మొత్తంగా ఢిల్లీ భేటీకి దూరంగా ఉండటం ద్వారా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారారు కేసీఆర్. షాతో సమావేశానికి కేసీఆర్ ఎందుకు రాలేదు?  ఆయన వ్యూహం ఏమిటన్న దానిపై చర్చ జరిగినా.. ఎవరూ ఆయన ఆలోచన ఏమిటన్న దానిపై చెప్పలేకపోవటం కనిపిచింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధాని మోడీని పిలవలేదన్న మాట వినిపిస్తే.. ప్రధాని మోడీ వచ్చే అవకాశం లేకపోవటంతో కేసీఆర్ ఆహ్వానించలేదంటున్నారు. మరోవైపు.. తమ తర్వాతి టార్గెట్ తెలంగాణగా బీజేపీ అగ్రనేతలు ఫిక్స్ చేసుకోవటమే కాదు.. ఇప్పటికే ఆ దిశగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. షా సమావేశానికి హాజరు కాకూడదని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి ఢిల్లీ సమావేశానికి దూరంగా ఉన్న కేసీఆర్ ఏం చేశారన్న విషయంలోకి వెళితే.. బడ్జెట్ రూపకల్పన విషయంలో ఆయన రోజంతా చర్చల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినా.. బడ్జెట్ రూపకల్పన..కసరత్తు చేయాల్సిన ఆర్థికమంత్రికి బదులుగా కేసీఆర్ చేయటం విశేషం.

మొత్తానికి అమిత్ షాతో జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టటం ద్వారా.. తాను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతకు మించిన మొండోడినన్న విషయాన్ని చేతలతో చేసి చూపించినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డుమ్మాతో తానేంటో చూపించిన కేసీఆర్ కు.. ఇలాంటి తీరును సీరియస్ గా తీసుకునే అమిత్ షా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News