ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు బ్రేక్..?

Update: 2023-02-27 14:00 GMT
కేసీఆర్ స్థాపించిన పార్టీకి వచ్చే ఏప్రిల్ లో ఆవిర్భావ సభను నిర్వహించరా? అందుకు కారణం ఏంటి? అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఏప్రిల్ 27న గులాబీ పార్టీకి ఆవిర్భావ సభను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి ఆ రోజున ఆవిర్భావ సభ ఉండకపోవచ్చని అంటున్నారు. అందుకు ఒకటి ఎన్నికల కారణమైతే.. మరొకటి బీఆర్ఎస్ గా అవతరించడమే. అవిర్భావ సభ నాటికి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అధికారికంగా నిర్వహించకపోవచ్చని చెప్పుకుంటుండగా.. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తరువాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహిస్తారని అంటున్నారు.

తెలంగాణలో గడువు లోగా ఎన్నికలు నిర్వహించాలంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆలోగానే ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ అనుకున్నట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏప్రిల్ లో ప్రభుత్వం రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఏప్రిల్ 27న సభ ఉండకపోవచ్చని అంటున్నారు. అయితే ప్రచార సభల్లో భాగంగానే ఎక్కడి కక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారని అంటున్నారు.

మరోవైపు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా అవతరించింది. గతేడాది అక్టోబర్ లో బీఆర్ఎస్ గా మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఈ నెలలోనే ఆవిర్భావ సభను నిర్వహిస్తారని అంటున్నారు. అయితే నిర్ణీత గడువుకు ఎన్నికలు నిర్వహిస్తే అక్టోబర్లో ఎన్నికల కోడ్ ఉంటుంది. లేదా ఆలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తయి, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఘనంగా ఆవిర్భావ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు అనుకుంటున్నారు.

దీంతో టీఆర్ఎస్ ఏప్రిల్ 27 చరిత్రలోనే మిగిలిపోతుందని, ఇక ఆరోజును మరిచిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ప్రత్యేకంగా పార్టీ సమావేశం పెట్టి అనౌన్స్ చేస్తారా? లేక ఎన్నికల సమయంలోనే ఆ విషయాన్ని చెబుతారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఏదీ ఏమైనా ఆవిర్భావ సభపై పార్టీ నేతల్లో కాస్త ఆయోమయం నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News