కేసీఆర్ కు బీజేపీ ద‌డ మొద‌లైంద‌ట‌!

Update: 2019-07-06 07:46 GMT
రాజ‌కీయానికి వైకుంఠ‌పాళికి పెద్ద తేడా ఉండ‌ద‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. అంతా బాగానే ఉన్న‌ట్లు అనిపించినా.. ఒక్క ఘ‌ట‌న‌.. ఒక వ్యాఖ్య‌.. ఒక ప‌రిణామం చాలు మొత్తం మారిపోవ‌టానికి.. ప‌రిస్థితి త‌ల‌కిందులు కావ‌టానికి. తాజాగా తెలంగాణ రాజ‌కీయం చూస్తే.. ఇదే విష‌యం అర్థం కాక‌మాన‌దు. తెలంగాణ‌లో కేసీఆర్ తో త‌ల‌ప‌డే మ‌గాడు.. మొన‌గాడు ఎవ‌డూ లేడ‌ని.. రానున్న ప‌దిహేనేళ్ల వ‌ర‌కూ త‌మ‌కు త‌ప్పించి మ‌రెవ‌రికి అవ‌కాశం లేదంటూ గులాబీ బ్యాచ్ బీరాలు ప‌లికిన వైనం చూస్తున్న‌దే.

కానీ.. అప్ప‌టివ‌ర‌కూ శ‌త్రుదుర్భేద్య‌మైన గులాబీ కోట‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు గండిప‌డేలా చేశాయ‌ని చెప్పాలి. ఎంట్రీకి ఏ మాత్రం అవ‌కాశం లేద‌న్న‌ప్పుడు ఉండే ఆలోచ‌న‌కు.. కాస్త అవ‌కాశం ఉంద‌న్న రుజువు కంటి ముందుకు వ‌చ్చేస్తే ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పులు వ‌స్తాయో తాజాగా తెలంగాణ రాజ‌కీయాన్ని చూస్తే అర్థం కాక మాన‌దు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో నాలుగు ఎంపీ స్థానాల్ని బీజేపీ ఖాతాలో వేసిన తెలంగాణ ఓట‌ర్ల నిర్ణ‌యంతో క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఆశ‌లు.. కొంగొత్త ఆకాంక్ష‌లు షురూ అయ్యాయి.  తాము ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన రీతిలో ప్ర‌య‌త్నం చేయ‌లేదు త‌ప్పించి.. త‌మ‌ను ఆద‌రించ‌టానికి.. అభిమానం చూపించ‌టానికి.. అంద‌లం ఎక్కించ‌టానికి తెలంగాణ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్న విష‌యాన్ని అర్థం చేసుకున్న క‌మ‌ల‌నాథులు.. తెలంగాణ మీద ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది.

తమ క‌న్ను ప‌డిన క్ష‌ణం నుంచి ప్ర‌త్య‌ర్థుల‌కు కౌంట్ డౌన్ మొద‌లెట్టే అల‌వాటున్న క‌మ‌ల‌నాథుల‌కు.. త‌మ‌కు చెమ‌ట‌లు ప‌ట్టేలా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో హ‌డావుడి చేసిన కేసీఆర్ సంగ‌తి చూడాల‌ని మోడీషాలు డిసైడ్ అయిన‌ట్లు చెబుతున్నారు. దీంతో.. తెర వెనుక మొద‌లైన మంత్రాంగాన్ని మొద‌లు పెట్టిన వైనాన్ని కేసీఆర్ గుర్తించిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గులాబీ నేత‌లను ట‌చ్ లోకి తీసుకుంటున్న క‌మ‌ల‌నాథులు.. కొత్త కొత్త  హామీలు ఇవ్వ‌టం షురూ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. మొన్న‌టి వ‌ర‌కూ త‌మ‌కు ఎదురే లేద‌ని ఫీలైన కేసీఆర్ సైతం ఇప్పుడు కాస్త అసౌక‌ర్యానికి గురి అవుతున్న‌ట్లు చెబుతున్నారు.

తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌ద‌వుల గురించి అడ‌గ‌టానికి సైతం సాహ‌సించ‌ని నేత‌లు ప‌లువురు.. తాజాగా తమ‌కిచ్చిన ప్రామిస్ ల‌ను ఎప్పుడు పూర్తి చేస్తార‌న్న సంకేతాల్ని బ‌లంగా పంప‌టం మొద‌లైంద‌ని చెబుతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ త‌మ‌దే రాజ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన గులాబీ బాస్ కు బీజేపీ అధినాయ‌క‌త్వం మొద‌లెట్టిన కెలుకుడుతో కొత్త గ‌డ‌బిడ మొద‌లైందంటున్నారు. ఇది కేసీఆర్ స్థాయి నుంచి ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. రంగంలోకి మోడీషాలే స్వ‌యంగా దిగితే ఎలాంటి సీన్ అయినా మారిపోతుంది క‌దా? 
Tags:    

Similar News