స్పీకర్ స‌రే..డిప్యూటీ స్పీక‌ర్ ఎవ‌రు?

Update: 2019-01-18 08:16 GMT
ఊహించిందే జ‌రిగింది. తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్...స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ చైర్‌ లో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్ కోరారు. నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రొటెం స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ చైర్ వద్దకు సీఎం కేసీఆర్ - ఈటల రాజేందర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లి చైర్‌ లో కూర్చోబెట్టారు. దీంతో స్పీకర్ గా పోచారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్‌ తో పాటు ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, ఇప్పటివరకూ సభాపతి ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొనగా... ఇప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ సీటుపై ఎవ‌రు ఆశీనులు కానున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. డిప్యూటీ స్పీకర్‌ గా రేఖా నాయక్ పేరు వినిపిస్తోంది. రేఖా నాయక్ పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని రేఖా నాయక్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ ఎస్ పార్టీ తరపున రెండోసారి ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రేఖా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ పదవిని రేఖా నాయక్ కు కట్టబెట్టేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎస్టీ కోటాలో రేఖా నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

కాగా, త‌మ తొలి స‌ర్కారులో కూడా స‌మీక‌ర‌ణాల‌కే పెద్ద పీట వేసి స్పీక‌ర్ - డిప్యూటీ స్పీక‌ర్ ఎంపిక‌ను సీఎం కేసీఆర్ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గా బీసీ సామాజికవ‌ర్గానికి చెందిన‌ మధుసూదనాచారి వ్యవహరించగా... ఉప సభాపతిగా పద్మా దేవేందర్ రెడ్డి వ్యవహరించారు.  తాజాగా రెడ్డి - ఎస్టీ సామాజిక‌వ‌ర్గం కోణంలో స్పీక‌ర్‌ - డిప్యూటీ స్పీక‌ర్ ఎంపిక‌ను కేసీఆర్ చేయ‌నున్న‌ట్లు విశ్లేషిస్తున్నారు.


Full View

Tags:    

Similar News