చ‌క్క‌టి ఛాన్స్ చేజార్చుకున్న కేసీఆర్‌!

Update: 2018-05-20 04:11 GMT
పెద‌వి విప్పారంటే చాలు.. ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌క‌ట‌న‌లు  చేసి ప్ర‌కంప‌నలు సృష్టించే అల‌వాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ది. మోడీకి ర‌హ‌స్య స్నేహితుడిగా.. ఆయ‌న ఆదేశాల్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసే అధినేత‌గా కేసీఆర్ ను అభివ‌ర్ణిస్తుంటారు. అయితే.. అలాంటిదేమీ లేదంటూ త‌న మాట‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు కొట్టి పారేస్తుంటారు టీఆర్ ఎస్ వ‌ర్గాలు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కొత్త త‌ర‌హా రాజ‌కీయాలంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్‌.. కేంద్రం అడ్డ‌గోలుత‌నాన్ని త‌న మాట‌ల‌తో క‌డిగిపారేశారు. ప్ర‌త్యేక ఫ్లైట్లు వేసుకొని వివిధ రాష్ట్రాల్లోని ముఖ్య‌నేత‌లతో భేటీ అయ్యారు. విందులు చేశారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ.. కాంగ్రెస్సేత‌ర ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో కొలువు తీర్చాల‌న్న త‌న సంక‌ల్పన్ని చెప్పుకొచ్చారు.

థియ‌రీగా చూసిన‌ప్పుడు కేసీఆర్ మాట‌లు అద్భుత‌మ‌న్న‌ట్లుగా క‌నిపిస్తాయి. మ‌రి.. ప్రాక్టిక‌ల్ లోకి వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ చెప్పే మాట‌లు.. ఆయ‌న చేత‌ల్లో అస్స‌లు క‌నిపించ‌వ‌నే అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. జాతీయ నేత‌గా.. మోడీ.. రాహుల్ కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు క‌ర్ణాట‌క రూపంలో అద్భుత అవ‌కాశం కేసీఆర్‌ కు వ‌చ్చింది.

ఏదో నోటి మాట‌ల‌తో కాకుండా.. రెండు ప్ర‌ధాన పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల్ని జాతీయ స్థాయిలో తీసుకురావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింద‌న్న విష‌యాన్ని క‌ర్ణాట‌క ఎపిసోడ్‌ తో నిరూపించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే.. ఈ ఎపిసోడ్‌ లో అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారే త‌ప్పించి.. కేసీఆర్ ఎక్క‌డా క‌లుగ జేసుకున్న‌  ప్ర‌స్తావ‌న వ‌చ్చింది లేదు. మోడీతో ముఖాముఖి అన్న‌ట్లుగా మారిన క‌ర్ణాట‌క ఎపిసోడ్ లో కానీ కేసీఆర్ చ‌క్రం తిప్పి ఉంటే జాతీయ స్థాయిలో ఆయ‌న క్రెడిబులిటీ.. ఇమేజ్ భారీగా మారిపోయేద‌ని చెబుతున్నారు.

జేడీఎస్‌.. కాంగ్రెస్ నేత‌లు హైద‌రాబాద్‌ కు మ‌కాం రావ‌టం వెనుక కేసీఆర్ అభ‌య హ‌స్తం ఉంద‌ని చెప్పుకున్నా.. ఆ పాత్ర ప‌రిమిత‌మైన‌దిగా చెప్ప‌క త‌ప్ప‌దు. రెండు ప్ర‌ధాన పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌నుకునే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఐడియాకు రూప‌క‌ర్త అయిన కేసీఆర్‌.. క‌ర్ణాట‌క ఎపిసోడ్‌ లో మ‌రింత కీ రోల్ ప్లే చేసి ఉంటే వ్య‌వ‌హారం మ‌రోలా ఉండేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

చూస్తూ.. చూస్తూ మోడీతో సున్నం పెట్టుకోవ‌టానికి సిద్ధంగా లేక‌పోవ‌టం.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో తొంద‌ర‌ప‌డితే అస‌లుకే ఎస‌రు రావ‌టంతో పాటు..త‌ర్వాతి టార్గెట్ తాను అవుతాన‌న్న ఆలోచ‌న‌తోనే కేసీఆర్ కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా చెబుతారు. తెగింపే త‌న ఆయుధంగా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్‌.. క‌ర్ణాట‌క ఎపిసోడ్ లో మాత్రం అందుకు భిన్న‌మైన తీరును ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జాతీయ‌స్థాయిలో వెలిగిపోయేందుకు. మోడీ ప‌రివారానికి షాకిచ్చిన మొన‌గాడిగా అవ‌త‌రించే ఛాన్స్ ను కేసీఆర్ చేజేతులారా మిస్ చేసుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెర వెనుక ఎంత చేసినా.. అదేమీ జాతి ప్ర‌జ‌ల దృష్టిలోకి వెళ్ల‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News