ఆగ‌స్టు 15 త‌ర్వాత సారు.. సీన్ మొత్తం మార్చేస్తార‌ట‌!

Update: 2019-07-19 06:34 GMT
భ‌లే ప్ర‌క‌ట‌న‌లు చేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆగ‌స్టు 15 నుంచి పాల‌న అంటే ఏమిటో చూపిస్తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కొత్త మున్సిప‌ల్ చ‌ట్టానికి సంబంధించిన బిల్లును తాజాగా అసెంబ్లీలో పెట్టిన సంద‌ర్భంగా కేసీఆర్ భారీఎత్తున‌ ప్ర‌సంగం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ‌మే తెలంగాణ‌ను చూసి పాల‌న‌ను నేర్చుకునేలా పాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో మార్పులు తేనున్న‌ట్లుగా చెప్పారు. అక్ర‌మ క‌ట్ట‌డాల్ని తాము ఎట్టి ప‌రిస్థాతుల్లో అనుమ‌తించేది లేద‌న్నారు. గ్రామాల్లో ప‌చ్చ‌ద‌నం పెర‌గాల‌ని.. ఇటీవ‌ల కాలంలో భారీగా పెరిగిన ఉష్ణోగ్ర‌త‌లపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మంచి పాల‌న‌.. మంచి ప‌ర్యావ‌ర‌ణాన్ని పెంచ‌ని ప‌క్షంలో భ‌విష్య‌త్ త‌రాలు ఎట్టి ప‌రిస్థితుల్లో క్ష‌మించ‌వ‌న్న ఆయ‌న‌.. మున్సిప‌ల్ వార్డుల్లో కౌన్సిల‌ర్లు.. ఇన్ ఛార్జ్ ఆఫీస‌ర్ల‌కు చెట్ల పెంప‌కం బాధ్య‌త అప్ప‌గించ‌నున్న‌ట్లు చెప్పారు. 85 శాతం మొక్క‌ల్ని బ‌తికించాల‌ని.. లేదంటే స‌ర్వీసు నుంచి తొల‌గిస్తామ‌న్నారు. పాల‌నా ప‌ర‌మైన పెను మార్పులు ఆగ‌స్టు 15 నుంచి వ‌స్తాయ‌ని కేసీఆర్ చెప్ప‌టం బాగానే ఉన్నా.. మ‌రింత కాలం చేసిందేమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌.

పాల‌న‌ను కొత్త పుంత‌లు తొక్కించేందుకు ఇంత‌కాలం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏమిటి?  అయితే.. ఉరుకులు ప‌రుగులు.. లేదంటే నిమ్మ‌ళంగా ఉండిపోవ‌టమా? అన్న‌ది మ‌రో సందేహం. ఊరించి ఊసురుమ‌నిపించ‌టంలో కేసీఆర్ సారు ట్రాక్ రికార్డు మ‌స్తుగా ఉంటుంద‌న్న మాట తాజా ఇష్యూలోనూ రిపీట్ అవుతుందా?  లేకుంటే కొత్త చ‌రిత్ర‌కు తెర తీస్తారా? అన్న‌ది తేలాలంటే ఆగ‌స్టు15 వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News