ఆ బిల్లు కోసం అర్థ‌రాత్రి ప్రింటింగ్ చేయించిన కేసీఆర్‌!

Update: 2019-07-21 05:13 GMT
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల్ని విన్న‌ప్పుడు.. ఇంత దూర‌దృష్టి.. స్ప‌ష్ట‌త‌.. ప్లానింగ్ ఉన్న నేత‌ సీఎంగా ఉండ‌టం త‌మఅదృష్టంగా భావిస్తుంటారు తెలంగాణ ప్ర‌జానీకం.మాట‌ల్లో అంత ప్ర‌భావాన్ని చూపించే కేసీఆర్‌.. చేత‌ల్లో ఎలా ఉంటారు? అన్న దానికి నిద‌ర్శ‌నంగా తాజా ఉదాహ‌ర‌ణ‌కు చెప్పొచ్చు.

కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ స‌మాచారం ప్ర‌కారం.. శుక్ర‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టి ఆమోదం పొందిన మున్సిప‌ల్ బిల్లుకు సంబంధించిన ప్ర‌తిని ఫైన‌ల్ చేసే విష‌యంలో చోటు చేసుకున్న హ‌డావుడి అంతా ఇంతా కాద‌ని చెబుతారు.

గురువారం అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు కాస్త ముందుగా స‌భ‌లో ప్ర‌వేశ పెట్టే బిల్లును సీఎం ఫైన‌ల్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బిల్లులోని ప్ర‌తి వ్యాక్యాన్ని చ‌ద‌వ‌ట‌మే కాదు.. త‌న‌కున్న అనుమానాల్ని ఉన్న‌తాధికారుల వ‌ద్ద ప్ర‌స్తావించి.. వాటి వివ‌రాలు తెలుసుకోవ‌టం.. మార్పులు చేర్పులు చేయ‌టం లాంటి ప‌నులన్ని పూర్తి చేయ‌టానికి గురువారం రాత్రి 11 గంట‌ల‌ వ‌ర‌కూ ప‌ట్టిన‌ట్లు స‌మాచారం.

స‌భ‌లో ప్ర‌వేశ పెట్టే బిల్లు ఫైన‌ల్ అయ్యాక‌.. వెంట‌నే దాన్ని తీసుకొని ప్రింటింగ్ చేయించ‌టం కోసం అధికార‌లు ప‌రుగులు తీసిన‌ట్లు చెబుతున్నారు. అశోక్ న‌గ‌ర్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో ఈ బిల్లును తెలుగు.. ఇంగ్లిషు.. ఉర్దూ భాష‌ల్లో ప్రింటింగ్ చేయించారు. తెల్ల‌వారితే బిల్లు స‌భ‌లో పెట్టాల్సి రావ‌టం.. బిల్లు కానీ ప్రింట్ రూపంలో త‌యారు కాకుంటే జ‌రిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

దీంతో.. రాత్రంతా ప్రింటింగ్  ప్రెస్ ద‌గ్గ‌రే ఉన్న అధికారులు తెల్ల‌వారుజామున ఐదున్న‌ర‌.. ఆరు గంట‌ల ప్రాంతంలో ప్రింటింగ్ మొత్తం పూర్తి కావ‌టంతో హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంట‌నే ఆ ప్రింటింగ్ కాపీల్ని అసెంబ్లీకి చేర్చి ఇంటికి వెళ్లారు. దూర‌దృష్టితో అన్ని విష‌యాలు అంత ఘ‌నంగా చెప్పుకునే ముఖ్య‌మంత్రి బిల్లును ఫైన‌ల్ చేసే విష‌యంలో చివ‌రి నిమిషం వ‌ర‌కూ మార్పులు చేర్పులు ఎందుకు చేసిన‌ట్లు?  ముందంతా ఏం చేసిన‌ట్లు?


Tags:    

Similar News