ఆశ్చర్యం..కేసీఆర్ నోట ఏపీలో కొత్త జిల్లాల మాట!

Update: 2020-03-07 14:30 GMT
కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. టీఆర్ ఎస్ అధినేతగానే కాకుండా కొత్త రాష్ట్రం తెలంగాణకు ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్న ఉద్యమ నేత. టీఆర్ఎస్ అధినేేత హోదాలో తెలంగాణకు సంబంధించిన వ్యవహారాలనో, ఆ పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలనో, లేదంటే ఆ పార్టీకి చెందిన భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపైనే మాట్లాడతారు. పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే... జాతీయ వ్యవహారాలపై మాట్లాడతారు. ఇక తెలంగాణ సీఎం హోదాలో తెలంగాణకు సంబంధించిన పాలనా వ్యవహరాలపై మాట్లాడతారు. అదంతా వదిలేసి పొరుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు ఏముంటుంది? కేసీఆర్ ఆ మేరకే మడుచుకుని నడిచే నేత కాదు కదా. అందుకే ఏపీకి సంబంధించిన కీలక వ్యవహారాలపైనా ఆయన మాట్లాడతారు. ఈ క్రమంలోనే ఏపీలో కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చిన కేసీఆర్... ఏపీలో త్వరలోనే 25 జిల్లాలు ఏర్పడతాయంటూ సంచలన కామెంట్ చేశారు.

ఏపీకి సంబంధించి కొత్త జిల్లాలపై అయితే గియితే సీఎం హోదాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడాలి. విపక్ష నేతగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే... ఏపీలో రాజకీయం చేస్తున్న ఏ పార్టీకి చెందిన నేత అయినా ఈ విషయంపై మాట్లాడే హక్కు ఉంది. అయితే ఏపీతో ఎలాంటి సాపత్యం లేని టీఆర్ఎస్ అధినేతగా, తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఈ మాట ఎందుకు మాట్లాడాలి. అందునా... త్వరలో ఏపీలో 25 జిల్లాలు ఏర్పడతాయంటూ కేసీఆర్ చెప్పడం చూస్తుంటే... ఏపీ వ్యవహారాల్లోనూ వేలు పెట్టేందుకు కేసీఆర్ ఆసక్తి చూపిస్తున్నారా? అన్నదిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.

ఏపీలో ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానంటూ వైఎస్ జగన్ ఎప్పుడో ఎన్నికలకు ముందే ప్రకటించారు. తాను అనుకున్నట్లుగానే మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం సీట్లో కూర్చున్న తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ మోస్తరు కసరత్తు కూడా చేశారు. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సరైన సమయం కోసం జగన్ ఎదురు చూస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇతర విషయాలపై దృష్టి సారించిన జగన్... ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటును పక్కనపెట్టేశారు. తాను అనుకున్న సరైన సమయం రాగానే... దీనిపై ఆయన చర్యలు ప్రారంభించే అవకాశాలున్నాయి. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా కేసీఆర్ నోట ఏపీలో కొత్త జిల్లాల మాట వినిపించిందంటే... జగనే ఆశ్చర్యపోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News