కేసీఆర్ ను వణికిస్తున్న ఆ ఐదు జిల్లాలు

Update: 2020-03-29 05:42 GMT
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలలో కూడా ఊహించని పరిస్థితి ఏదైనా ఉందంటే.. అదిప్పటి పరిస్థితేనని చెప్పాలి. తన పదవీ కాలంలో ఎలాంటి పరిస్థితి అయితే రాకూడదని కోరుకుంటారో.. ఇప్పుడు అలాంటి పరిస్థితితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న వైనం అంతకంతకూ పెరుగుతున్నాయి.

దీంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఐదు జిల్లాల్లోనే ఎక్కువగా ఉండటం.. మిగిలిన జిల్లాల్లో ఆ ఛాయలు కనిపించకపోవటం కొంత ఊరటనిస్తోంది. అదే సమయంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఐదు జిల్లాలు కేసీఆర్ కు కలవరానికి గురి చేస్తున్నాయి. హైదరాబాద్.. కరీంనగర్.. భద్రాద్రి-కొత్తగూడెం.. రంగారెడ్డి.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవటం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు మినహాయిస్తే.. మిగిలిన అన్ని కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బయటపడ్డాయి. విస్తీర్ణం.. జనాభా భారీగా ఉండటంతోపాటు.. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో ఎక్కువగా ఉండటంతో కేసుల నమోదు ఎక్కువగా ఉందని చెప్పాలి.

హైదరాబాద్ తో పాటు.. మహానగర పరిధిలోనే ఉండే రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండటం.. జనాభా ఎక్కువగా ఉండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు కావటానికి కారణంగా చెబుతున్నారు. ఒక్క శంషాబాద్.. కోకాపేట.. ఐటీ కారిడార్ లో అత్యధికంగా హోం క్వారంటైన్ చేయటం గమనార్హం. కరోనా ముప్పు ఈ ఐదు జిల్లాలను దాటకుండా చేయాలన్నది కేసీఆర్ తాజా ప్లాన్ అని చెబుతున్నారు. వైరస్ ను ఈ జిల్లాలకు పరిమితం చేయటం ద్వారా.. దీని వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News