నేతల ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గుతారా.?

Update: 2019-08-21 04:45 GMT
ఇప్పుడు గులాబీ పార్టీలో అందరూ మొత్తుకుంటున్నారు.. నిన్న కూకట్ పల్లిలో సభ.. మొన్న సిరిసిల్లలో సభ.. అదే కథ.. కేటీఆర్ కోసం అదే వ్యథ.. కేటీఆర్ ప్రభుత్వంలో లేకపోవడంతో తమకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యేలు - మంత్రులు కూడా ఏకరువు పెట్టిన తీరు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా కూకట్ పల్లిలో జరిగిన సభలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాధవరావు మంత్రులు - కేటీఆర్ - నాయకుల ముందే కుండబద్దలు కొట్టేశాడు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంతోపాటు హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. పనులు ఇట్టే అయ్యేవని.. ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని వాపోయాడు. కార్యకర్తలు - నేతలంతా కేటీఆర్ త్వరగా మంత్రి కావాలని కోరుకుంటున్నట్టు విన్నవించారు.

ఇక కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనూ అదే కథ. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా ప్రొటోకాల్ ప్రకారం కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో కొన్ని శంకుస్థాపనలు - అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఈటల రాజేందర్ తో ఇటీవల నిర్వహించారు. ఇక పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయట.. దీన్ని సిరిసిల్ల నేతలు జీర్ణించుకోవడం లేదట.. కేటీఆర్ మంత్రి కావాల్సిందేనని వారంతా మూకుమ్మడిగా కేటీఆర్ ను కోరారట..

ఇలా మంత్రిగా జెట్ స్పీడ్ తో పాలనను చక్కదిద్ది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా తన శాఖల్లో పనులను శరవేగంగా చేసిన కేటీఆర్ లేని లోటు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో.. ఎమ్మెల్యేలు - మంత్రుల్లో ప్రస్ఫూటంగా కనిపిస్తోందట.. వెంటనే కేటీఆర్ ను మంత్రిని చేయాలనే డిమాండ్ మంత్రులు తలసాని - మల్లారెడ్డి - సహా ఎమ్మెల్యేలు - నేతలందరి దగ్గరి నుంచి వినపడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

అయితే దసరా తర్వాతే కేబినెట్ విస్తరణ అని చెప్పిన కేసీఆర్ నేతల నుంచి వస్తున్న ఒత్తిడితో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల ముందే కేబినెట్ విస్తరణకు ప్లాన్ చేస్తున్నారన్న వార్త టీఆర్ ఎస్ లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇదే జరిగితే ట్రబుల్ షూటర్ హరీష్ - కేటీఆర్ లు మంత్రులైపోతారని నేతలు ఆశిస్తున్నారు.


Tags:    

Similar News