సీఎం గారు ఏంటా మాటలు....

Update: 2015-04-22 04:18 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యవహారశైలి ఎప్పడూ ఆసక్తికరమే. ఉద్యమ నేతగా తన ప్రత్యేకతను చాటుకున్న కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా తన ప్రత్యేకతను కాపాడుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత అంశాలపై తెలంగాణ సీఎంకు బెంగ ఎక్కువ అయినట్లు కనిపిస్తోంది. మాదాపూర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో జరిగిన ఓ కార్యక్రమంలోకే కేసీఆర్‌ మాట్లాడుతూ 'ఇపుడు నాకు 61 ఏళ్లు. తెలంగాణ కల నెరవేరింది. వేరే కోరికలేం లేవు. ఇకపై నేనున్నా.. లేకపోయినా.. తెలంగాణలో ఉండేవారు మీరే..! అని కళాకారులతో వ్యాఖ్యానించిన విషయం మరవక ముందే మరోమారు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్‌, లింగ బలిజ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బసవేశ్వర 882వ జయంతోత్సవాలకు కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మరోసారి వేదాంత ధోరణిలో మాట్లాడారు. 'భవంతుడు నాకు అవకాశం ఇస్తే.. బసవేశ్వరుడి దయ నాపై ఉంటే.. కచ్చితంగా బసవ భవన్‌కు ఫౌండేషన్‌ నేనే వేస్తా...' అన్నారు. దీంతో సభప్రాంగణంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

కళాకారులతో జరిగిన సమావేశంలో నేనున్నా...లేకున్నా అని సీఎం అంటుండగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి జోక్యం చేసుకుని 'సార్‌ మీరలా మాట్లాడొద్దు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి.' అన్నప్పటికీ రమణాచారిని కూర్చోమని సైగ చేస్తూనే.. కేసీఆర్‌ వేదాంత ధోరణిలో ప్రసంగం కొనసాగించారు. మంగళవారం రవీంద్రభారతి కార్యక్రమంలోనూ అదే ధోరణిలో సీఎం మాట్లాడటం పార్టీలో కొత్త చర్చకు కారణమైంది.

ముఖ్యమంత్రి పదే పదే ఎందుకీ వ్యాఖ్యలు చేస్తున్నారనే అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆరోగ్యం బాగా లేదనే పుకార్లు కొద్ది కాలం షికార్లు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ ఈ విషయాన్ని ఖండించారు. అయినప్పటికీ ఆ వాదనలకు బలం చేకూరే దిశగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. కొద్దికాలం క్రితం ప్రత్యేక ఫుడ్ ఇన్స్ పెక్టర్ ను సీఎం కోసం నియమించుకోవడం, ఆ తర్వాత సీఎం కాన్వాయ్ లోకి ప్రత్యేక, పటిష్టమైన జామర్ ను ఏర్పాటు చేయడం వంటివన్నీ దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో సీఎం సైతం తన గురించి ఇలా వేదాంత దోరణిలో మాట్లాడటం... ఇందుకు బలం చేకూరుస్తున్నట్లు ఉన్నాయి.

Tags:    

Similar News