చెట్ల కింద పని చేసే వారి సంగతి చూడండి కేసీఆర్

Update: 2016-03-07 04:22 GMT
ప్రాధాన్యతల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం ఆయన తీరు సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. కొన్ని నమ్మకాల విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తూ.. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్.. మరికొన్ని ముఖ్యమైన విషయాల్లో ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించటం సరికాదన్న మాట వినిపిస్తోంది.

రాష్ట్రం ఏర్పాటు అయి 20 నెలలు అవుతున్నారు.. ఏపీ సరిహద్దుల్లో ఇప్పటివరకూ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసింది లేదు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. పగలు చెట్ల కింద.. రాత్రిళ్లు డాబాలను అడ్డాగా మార్చుకొని అంతర్రాష్ట్ర వాహనాల్ని తనిఖీ చేస్తున్న వైనం చూసినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. ఏపీ నుంచి వచ్చే వాహనాల్ని తనిఖీ చేయటం.. వాటి పన్నుల వ్యవహారం సమీక్షించటం.. నిఘాకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.

ఇందుకు సంబంధించి వాణిజ్యపన్నుల శాఖ తొలిదశలో కొన్ని ఏర్పాట్లు అవసరమని.. అందుకోసం రూ.100కోట్ల నిధులతో చేపట్టాల్సిన అంశాల్ని రూపొందించింది. అయితే.. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.12 కోట్లు మాత్రమే కేటాయించటం విమర్శలకు  గురి అవుతోంది. నిజానికి ఏపీ సరిహద్దుల్లోనే కాదు.. తెలంగాణకు మహారాష్ట్ర.. కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దులు ఉన్నయి. వీటికి ఇప్పటివరకూ సరైన చెక్ పోస్ట్ లు లేవు. సరిహద్దుల్లో అధునాతన చెక్ పోస్ట్ ల ఏర్పాటు కారణంగా ప్రభుత్వానికి మరింత ఆదాయం లభించే అవకాశం ఉంది.

అయితే.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. పాలకుల ప్రాధాన్యతలో చోటు చేసుకుంటున్న అలసత్వం కారణంగా పటిష్టంగా ఉండాల్సిన చెక్ పోస్ట్ వ్యవస్థ తూతూ మంత్రంగా మారింది. ఓపక్కన సీఎం అధికార నివాసం ఏర్పాటుకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక.. కొత్త సచివాలయం ఇలా లెక్కకు మించిన కొత్త కొత్త అంశాలకు కోట్లాది రూపాయిలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. చెక్ పోస్ట్ ల దగ్గర కనీస ఏర్పాట్లు చేయటాన్ని పట్టించుకోకపోవటం ఏమిటో అర్థం కాదు. ప్రభుత్వానికి కాసులు కురిపించే వ్యవస్థపై కేసీఆర్ కన్ను ఎందుకు పడటం లేదు..? పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న కేసీఆర్.. చెట్ల కింద విధులు నిర్వర్తిస్తున్న అధికారుల సంగతి ఎందుకు పట్టటం లేదు..?
Tags:    

Similar News