తెలంగాణ‌లో కొత్త జిల్లాలు.. మండ‌లాలు ఇవే

Update: 2018-12-17 07:48 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్ర‌చార స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చే దిశ‌గా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయ‌న రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త‌గా 6 మండ‌ల కేంద్రాలు - ఓ రెవెన్యూ డివిజ‌న్ ను కూడా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

రాష్ట్ర ఆవిర్భావ స‌మ‌యంలో తెలంగాణలో కేవ‌లం 10 జిల్లాలు ఉండేవి. కేసీఆర్ తొలిసారి ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టాక వాటిని 31 జిల్లాలుగా చేశారు. అయినప్ప‌టికీ మ‌రికొన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు జిల్లాల‌ను డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ లోని ములుగు - ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని నారాయ‌ణ‌పేట వాసులు త‌మ ప్రాంతాల‌ను జిల్లాలుగా ఏర్పాటుచేయాల‌ని డిమాండ్ చేశారు. పెద్ద‌యెత్తున ధ‌ర్నాలు చేప‌ట్టారు. అయితే - అప్ప‌ట్లో వాటి ఏర్పాటు సాధ్య‌ప‌డలేదు.

తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాష్ట్రమంత‌టా ప‌ర్య‌టించిన కేసీఆర్‌.. తాము మళ్లీ అధికారంలోకి వ‌స్తే ములుగు - నారాయ‌ణ‌పేట‌ల‌ను జిల్లాలుగా ఏర్పాటుచేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ హామీని నెర‌వేరుస్తూ రెండు జిల్లాల ఏర్పాటుపై అధికారుల‌కు కేసీఆర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో వారిని ఆదేశించారు. 12 మండ‌లాల‌తో నారాయ‌ణ‌పేట జిల్లా - 9 మండ‌లాల‌తో ములుగు జిల్లా ఏర్పాటుకానున్నాయి. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని కోరుట్ల‌ను ప్ర‌త్యేక రెవెన్యూ డివిజ‌న్ కేంద్రంగా ఏర్పాటుచేయాల‌నీ సూచించారు.

కేసీఆర్ ఆదేశాల‌తో న‌ల్గొండ జిల్లాలోని గ‌ట్టుప్ప‌ల్‌ - భూపాల‌ప‌ల్లి జిల్లా ప‌రిధిలోని మ‌ల్లంప‌ల్లి - బాన్స్ వాడ నియోజ‌క‌వ‌ర్గంలోని చందూరు - మెస్రా - మెహ‌బూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి - సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గంలోని నారాయ‌ణ్ రావు పేట్ ల‌కు కొత్త‌గా మండ‌లాల హోదా ల‌భించ‌నుంది. ఇక ప్ర‌స్తుతం జ‌న‌గామ జిల్లాలో ఉన్న గుండాల మండ‌లాన్ని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోకి తీసుకురావాల‌ని రెవెన్యూశాఖ అధికారుల‌ను కేసీఆర్ ఆదేశించారు. 


Tags:    

Similar News