ప్రెస్ మీట్లో రిపోర్ట‌ర్ల నోరు మూయించిన కేసీఆర్‌

Update: 2018-09-07 05:30 GMT
పొలిటిక‌ల్ రిపోర్టింగ్ చేయ‌టం అంటే మామూలు కాదు. క‌త్తి మీద సాముగా చెప్పాలి. నిత్యం నిప్పుల మీద న‌డ‌క‌లా ఉంటుంది. ఒక్క మేజ‌ర్ పాయింట్ మిస్ అయితే.. స‌ద‌రు పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ కెరీర్ కే పెద్ద బ్లాక్ స్పాట్ లా అత‌గాడు ప‌ని చేసే సంస్థ వేసేస్తుంది. స్కోరింగ్ చేసిన‌ప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో మిస్సింగ్ జ‌రిగిన‌ప్పుడు ఎదుర‌య్యే ఒత్తిడి అంతా ఇంతా కాదు.

చాలా సంద‌ర్భాల్లో పొలిటిక‌ల్ అంశాల్ని స‌రిగా ఇవ్వ‌లేక‌పోయారంటూ మీడియాను వేలెత్తి చూపించే వారు చాలామంది క‌నిపిస్తారు. కానీ.. అలాంటి వారంతా మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. మారిన ప‌రిస్థితులే దీనికి కార‌ణంగా చెప్పాలి. మీడియాను వ్యాపారంగా కంటే కూడా దానికి అతీతంగా ర‌న్ చేసే విధానం మొద‌ట్నించి ఉంది. కానీ.. ఎప్పుడైతే యాజ‌మాన్యాలే నేరుగా పాల‌కుల‌తో సంబంధాలు ఏర్ప‌ర్చుకొని.. వారి అవ‌స‌రాల్ని తీర్చ‌టం.. వారి అబ్లిగేష‌న్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం మొద‌లు పెట్టాయో.. అప్ప‌టి నుంచి ప‌త‌నం మొద‌లైంద‌ని చెప్పాలి.

ఈ రోజున విష‌యం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే.. సూటిగా ఒక ప్ర‌శ్న‌ను సంధించ‌లేని దుస్థితి తాజాగా నెల‌కొంది. ఎక్క‌డి దాకానో ఎందుకు..?  అసెంబ్లీ ర‌ద్దు నేప‌థ్యంలో తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా సూటి ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేయాల‌న్న ఆలోచ‌న ఉన్న ఇద్ద‌రు ముగ్గురు సీనియ‌ర్ రిపోర్ట‌ర్ల‌కు త‌న మాట‌ల‌తో పంచ్ లు వేయ‌టం ద్వారా నోరు మూసే ప్ర‌య‌త్నం చేశారు.

ప్రెస్ మీట్లో ఎలా అయితే వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దో.. స‌రిగ్గా అలా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా మీడియా ప్ర‌తినిధుల మీద కేసీఆర్ దూకుడు ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. ఇదే తీరును ఇర‌వై ఏళ్ల కింద‌ట ప్ర‌ద‌ర్శించి  ఉంటే.. ఆ స‌మావేశాన్ని పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్లు బ‌హిష్క‌రించి ఉండేవార‌న‌టంలో సందేహం లేదు.

మ‌రిప్పుడు ఎందుకు ఆ ప‌ని చేయ‌లేద‌న్న సందేహం రావొచ్చు. ఒక‌వేళ దూకుడుగా ప్ర‌శ్న‌లు వేసే మీడియా ప్ర‌తినిధి ఎవ‌రైనా ఉంటే.. ఆ వెంట‌నే అత‌గాడి ఉద్యోగం చేసే ప్లేస్ మారిపోవ‌టం ఖాయం. మీడియా యాజ‌మాన్యాల‌తో పార్టీల‌కు పెరిగిన సాన్నిహిత్యం.. మీడియా ప్ర‌తినిధితో మాట్లాడే కంటే.. నేరుగా య‌జ‌మానుల‌తో మాట్లాడుకునే కొత్త విధానం ఒక‌టి వ‌చ్చేయ‌టంతో జీతం రాళ్ల కోసం బ‌తికే జ‌ర్న‌లిస్టుల నోళ్ల‌కు తాళాలు ప‌డ‌ట‌మే కాదు.. ప్ర‌శ్న‌లు వేసి మ‌రీ స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకోవ‌టం.. ఉద్యోగ భ‌ద్ర‌త మీద నీలినీడ‌లు క‌ల్పించుకునే సాహ‌సం ఏ జ‌ర్న‌లిస్టు మాత్రం చేయ‌గ‌ల‌డు చెప్పండి?
Tags:    

Similar News