కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్‌ లు!... ఆ ఇద్ద‌రికీ అందిన‌ట్టే!

Update: 2019-02-26 06:32 GMT
రిట‌ర్న్ గిఫ్ట్‌... తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు నోరిప్పే దాకా వీటికి పెద్ద‌గా ప్ర‌చారం లేద‌నే చెప్పాలి. అయితే ఎప్పుడైతే... త‌న‌ను ఓడించేందుకు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న అనుకూల మీడియా సంస్థ‌ల‌ అధినేత‌లు, కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా క‌లిసి క‌ట్ట క‌ట్టుకుని వ‌చ్చారో... అప్పుడే కేసీఆర్ మైండ్ లో ఈ రిట‌ర్న్ గిఫ్ట్‌ల మాట బలంగా ఫిక్సైపోయిన‌ట్టుంది. ఎన్నిక‌లు ముగిసి రెండో ద‌ఫా సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మీడియా స‌మావేశం పెట్టిన కేసీఆర్‌... త‌న‌ను ఓడించేందుకు కృషి చేసిన వారంద‌రికీ రిట‌ర్న్ గిఫ్ట్‌ లు ఇస్తానంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ప్ర‌ధానంగా చంద్ర‌బాబును టార్గెట్ చేసుకునే కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేసినా... ఆయ‌న టార్గెట్లు చాలానే ఉన్నాయ‌ని తాజా ఉదంతాలు చెబుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్ర‌క‌టించిన కేసీఆర్‌... ఆ ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా ముందుగానే చంద్రబాబుకు స‌హ‌క‌రించిన ఇద్ద‌రు ప్ర‌ముఖులకు రిట‌ర్న్ గిఫ్ట్ లు ఇచ్చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఆ క‌థాక‌మామీషు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓట‌మే టార్గెట్ గా చంద్ర‌బాబు సిద్ధాంతాల‌ను వ‌దిలేసి కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌డితే... ఆ పార్టీల కూట‌మిగా రంగంలోకి దిగిన మ‌హా కూట‌మి గెలుపున‌కు టీడీపీ అనుకూల మీడియాగా ప్ర‌సిద్ధికెక్కిన ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ప‌త్రిక‌లు అప్ప‌టిక‌ప్పుడే త‌మ అస‌లు రంగును బ‌య‌ట‌పెట్టుకున్నాయి. అప్ప‌టిదాకా టీఆర్ ఎస్ కు అనుకూలంగానే వ్య‌వ‌హ‌రించిన ఈ రెండు ప‌త్రిక‌లు ఎప్పుడైతే... కేసీఆర్ ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా మారిపోయారో, అప్పుడే త‌మ అస‌లు రూపాన్ని మ‌రోమారు బ‌య‌ట‌పెట్టుకున్నాయి. ఆంధ్రా ఆక్టోప‌స్‌ గా పేరొందిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ను చంద్ర‌బాబు రంగంలోకి దించేస్తే... త‌న క్రెడిబిలిటీనే పెట్టుబ‌డిగా పెట్టిన రాజ‌గోపాల్ న‌కిలీ స‌ర్వేల‌కు తెర తీశారు. మ‌హా కూట‌మి గెలుపు ఖాయ‌మ‌ని, టీఆర్ ఎస్‌ కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని త‌న స‌ర్వేలో వెల్ల‌డించేశారు. ఈ ప్లాంటెడ్ స‌ర్వేను ప‌తాక శీర్షిక‌ల‌తో అచ్చేసిన‌ప ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులు... ఎన్నిక‌ల‌కు ముందు ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు త‌మ వంతు య‌త్నాలు చేశాయి. అయితే ఈ త‌ర‌హా చావు తెలివి తేట‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు తిప్పికొట్టగా... టీఆర్ ఎస్ మ‌రింత బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో విజ‌యం సాధించింది. కేసీఆర్ రెండో ద‌ఫా సీఎం అయ్యారు. ఈ క్ర‌మంలో త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను కేసీఆర్ అర్థం చేసుకున్నారు. తాను అధికారంలో ఉంటే... ఎంత‌గా త‌న పాట పాడినా... ఆంధ్రా యాజ‌మాన్యాల కింద ప‌నిచేస్తున్న ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు త‌ర‌హా ప‌త్రిక‌లు ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ని యోచించారు.

ఈ రెండింటి యాజ‌మాన్యాల‌కు రిటర్న్ గిఫ్ట్‌ ల‌ను సిద్ధం చేసేశారు. అందుకే స‌మాచార‌, ప్రజా సంబంధాల మంత్రిత్వ శాఖ‌ను త‌న వ‌ద్దే పెట్టుకున్న కేసీఆర్‌... ఆ గిఫ్ట్‌ ల‌ను ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ప‌త్రిక‌ల‌కు ఇచ్చేశారు. ఎలాగంటే... ఏటా ఆయా ప‌త్రిక‌లు, టీవీ ఛానెళ్లు త‌మ అడ్వ‌ర్టైజ్‌ మెంట్ టారిఫ్ పెంపు ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వానికి అందజేస్తాయి క‌దా. ఈ ద‌ఫా కూడా తెలంగాణ‌లోని అన్ని ప‌త్రిక‌లు ఈ ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌భుత్వానికి అంద‌జేశాయి. అయితే ఈ శాఖ‌ను తానే చూస్తున్న కేసీఆర్‌... అంద‌రి ప్ర‌తిపాద‌న‌ల‌కు ఓకే చెప్పేసి... ఆంధ్రజ్యోతి, ఈనాడు యాడ్ టారిఫ్ ప్ర‌తిపాద‌న‌ల‌ను మాత్రం ప‌క్క‌న‌పెట్టేశార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న రెండు పత్రిక‌లు కేసీఆర్‌ ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నాయ‌ట‌. అయినా గానీ... మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఈ రెండు ప‌త్రిక‌లు అనుస‌రించిన వ్యూహాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తు చేసుకుంటున్న కేసీఆర్‌.... ఎంత గింజుకున్నా... ఆ ప్ర‌తిపాద‌న‌ల‌ను మాత్రం ఆమోదించేందుకు స‌సేమిరా అంటున్నార‌ట‌. సో... కేసీఆర్ త‌న తొలి విడ‌త రిట‌ర్న్ గిఫ్ట్‌ల‌ను ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు యాజ‌మాన్యాల‌కు ఇచ్చేసిన‌ట్టేన‌న్న మాట‌.

Tags:    

Similar News