కొత్త అసెంబ్లీ కోసం కేసీఆర్ ఆ స్థ‌లాన్ని చూడ‌మ‌న్నార‌ట‌!

Update: 2019-06-14 06:06 GMT
మ‌న‌సులోకి ఆలోచ‌న రావ‌టం ఆల‌స్యం.. దాన్ని అమ‌లు చేసే వాళ్లు కొంద‌రుంటారు. మ‌రికొంద‌రు తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆలోచ‌న రాగానే స‌రికాదు.. దాని కార‌ణంగా వ‌చ్చే లాభ‌న‌ష్టాల మీద మదింపు చేస్తుంటారు. మొద‌టి కోవ‌కు చెందిన వారికి న‌మ్మ‌కాల మీద విశ్వాసం ఉంటే.. వారిని ఆప‌టం ఎవ‌రి వ‌ల్లా సాధ్యం కాదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి కూడా ఇంతే.

ఆయ‌న‌కు న‌మ్మ‌కాలు.. విశ్వాసాలు ఎంత ఎక్కువో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తొలిసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినంత‌నే కొత్త అసెంబ్లీ.. కొత్త స‌చివాల‌యాన్ని ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చారు. దీంతో.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు షురూ చేశారు. ఎన్నో ఆలోచ‌న‌లు చేశారు. ఎన్నో వ్యూహాలు ప‌న్నారు.

అదృష్ట‌మో.. దుర‌దృష్ట‌మో కానీ.. ఆయ‌న ఆలోచ‌న‌లు ఏవీ వ‌ర్క్ వుట్ కాలేదు. తాను అనుకున్న త‌ర్వాత జ‌ర‌గ‌క‌పోవ‌టం ఏమిట‌న్న భావ‌నో మ‌రేమో కానీ.. కొత్త స‌చివాల‌యం.. అసెంబ్లీ భ‌వ‌నాల్ని నిర్మించాల‌న్న ప‌ట్టుద‌ల కేసీఆర్ లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా ఇప్పుడున్న స‌చివాల‌యాన్ని కూల‌గొట్టేసి.. దాని స్థానే భారీ ఎత్తున స‌రికొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

సచివాల‌య నిర్మాణం కోసం ఏపీకి కేటాయించిన భ‌వ‌నాల్ని తిరిగి తీసేసుకున్న కేసీఆర్‌.. నెల‌లో కొత్త స‌చివాల‌య నిర్మాణానికి శంకుస్థాప‌న చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి కీల‌క అడుగు ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఖైర‌తాబాద్ కు కూత‌వేటు దూరంలో ఉండే ఎర్ర‌మంజిల్ లో కొత్త అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించాల‌న్న కొత్త ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఎర్రమంజిల్ లోని రోడ్లు.. భ‌వ‌నాల శాఖ కార్యాల‌య స్థ‌లాన్ని తాజాగా ప‌రిశీలిస్తున్నారు.

ఇందుకు సంబంధించి కేసీఆర్ నుంచి ఆదేశాల మేర‌కు.. ప‌లువురు ఉన్న‌తాధికారులు ఎర్ర‌మంజిల్ కు వెళ్లి.. అసెంబ్లీ భ‌వ‌న నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన స్థ‌ల ప‌రిశీల‌న జ‌రుపుతున్నారు. ఇక్క‌డున్న స్థ‌లంపై సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అదే జ‌రిగితే.. రానున్న రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎర్ర‌మంజిల్ కు షిఫ్ట్ అయిన‌ట్లే. మొత్తానికి.. సారు అనుకున్న‌ది సాధిస్తున్న‌ట్లే.
Tags:    

Similar News