అంతలా తిట్టి కేంద్రం దగ్గరకు వెళ్లే దమ్ము కేసీఆర్ దే...

Update: 2016-06-04 06:23 GMT
కొన్ని కొందరికే సాధ్యం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి వ్యవహారశైలి ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. తన ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే అంశం ఏదైనా.. అవతల వ్యక్తులు ఎవరైనా.. వారిని విమర్శించే విషయంలో కేసీఆర్ అస్సలు తగ్గరు. రేపటి సంగతి తర్వాత.. ఈ రోజు సంగతి గురించి మాత్రమే ఆలోచిస్తారు. బలంగా ఉన్నన్ని రోజులు.. ప్రజాదరణకు ఢోకా లేనంతవరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరన్నట్లుగా ఉంటుంది ఆయన వైఖరి. అందుకే.. ప్రధానిని విమర్శించటానికి వెనుకాడరు. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ చీఫ్ ను అంత చీప్ గా ఎలా ఆలోచిస్తారు.. అంత చిల్లరగా ఎలా మాట్లాడతారు? అనేసి కూడా అనగలరు.

ఓపక్క ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో భుజాలు..భుజాలు రాసుకుంటూ తిరుగుతూనే.. మరోవైపు వారిని టార్గెట్ చేసే ధోరణి కేసీఆర్ లో కనిపిస్తుంది. ప్రత్యర్థి పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా ఉండటమే కాదు.. తన ప్రయోజనాల ముందే మరి వేటిని పట్టించుకోని తత్వం కేసీఆర్ లో చాలా ఎక్కువే. అందుకే ఆయన తిట్టేటప్పుడు తిడుతూనే ఉంటారు. అవసరమైనప్పుడు మరింకేమీ ఆలోచించకుండా కేంద్రం దగ్గరకు వెళ్లటానికి సిద్ధమవుతారు.

తన రెండేళ్ల పాలనపు పూర్తి చేసిన సందర్భంగా కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చిన కేసీఆర్.. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయటం లేదన్న మాటతో పాటు తేల్చి చెప్పటంతో పాటు.. కేంద్రం మీద పోరాటం చేస్తామని చెప్పి నాలుగు రోజులు కాక ముందే ప్రాజెక్టుల వ్యవహారంలో ఏపీ తీరు మీద కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పటం విశేషం. ఓ నోటితో విమర్శలు చేస్తూనే.. మరో నోటితో కేంద్ర సాయం కోసం వెళతామని చెప్పటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో..?

తన ప్రత్యేక ఇంటర్వ్యూలలో కేంద్రం మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మోడీ దగ్గరకు చేరాయో లేదో అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ చేరినా ఇప్పటికిప్పుడు కేసీఆర్ తో తగువు పెట్టుకునే పరిస్థితి లేదు. రాజ్యసభలో బలం లేని నేపథ్యంలో.. ఎటూ మొగ్గని బలమైన ప్రాంతీయ పార్టీలతో స్నేహం కోసమే మోడీ చూస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అవసరం మోడీకి లేకపోలేదు. మరోవైపు.. కేంద్రాన్ని విమర్శలు చేస్తూనే వారి దగ్గరకు సాయం కోసం కేసీఆర్ ఎలా వెళతారన్న సందేహం పలువురికి వస్తుంటుంది. కానీ.. ఇక్కడ కేసీఆర్ లాజిక్ ఏమిటంటే.. విభేదాలు ఇష్యూస్ పరంగానే కానీ మరోలా కాదన్నట్లుగా ఉంటుంది. ఆయన మాటలు కూడా అలానే ఉంటాయి. ఇంటర్వ్యూల సమయంలో టోన్ పెంచి మాట్లాడే ఆయన.. ప్రధానిని కలిసినప్పుడు చాలా వినయాన్ని ప్రదర్శిస్తారు. కేసీఆర్ తీరు గురించి కొందరు సీనియర్ పాత్రికేయులు ఒక ఉదంతాన్ని అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు.

కేసీఆర్ వైఖరి గురించి తన సహచరులతో ఒకసారి మాట్లాడుతూ.. ‘అతడు అస్సలు అర్థం కాదు. కలిసినప్పుడు చాలా మర్యాదగా ఉంటాడు. అలాగే చేద్దాం అన్నా అంటాడు. కానీ.. బయట మాత్రం ఆయన మాటలు చాలా కటువుగా ఉంటాయి. కలిసినప్పుడు చక్కగా ఉండే మనిషి.. బయటకు వెళ్లగానే అలా ఎలా మారిపోతారో అర్థం కాదు’ అని వాపోయినట్లుగా చెబుతుంటారు. నిజానికి కేసీఆర్ బలం ఏమిటన్నది బాబు చెప్పిన మాటల్లోనే ఉందని చెప్పాలి.
Tags:    

Similar News