రివర్సు గేర్.. మోడీ సర్కారుపై కేసీఆర్ సంచలన ఆరోపణలు

Update: 2022-02-13 05:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కుంభకోణం ఆరోపణను ఎదుర్కొనని మోడీ సర్కారుపై సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.. మోడీ సర్కారు అవినీతిని తాను బయటపెడతానంటూ సంచలనంగా మారారు. తన దగ్గర మోడీ సర్కారు అవినీతి చిట్టా ఉందని పేర్కొన్నారు.

గడిచిన కొద్ది రోజులుగా మోడీ సర్కారు మీద విరుచుకుపడుతున్న కేసీఆర్.. తాజాగా అనూహ్య వ్యాఖ్యలు చేయటం ద్వారా.. జాతీయ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేలా చేశారు. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీని దేశం నుంచి తరిమికొడతానని వ్యాఖ్యానించిన కేసీఆర్.. రోజు తిరిగేసరికి.. ఏ మాత్రం తగ్గకుండా మరింత ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తాజాగా యాదాద్రిలో వీవీఐపీల కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్లతో పాటు భువనగిరి జిల్లాలో సమీక్రత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.

''కేంద్ర ప్రభుత్వంలో జరగే అవినీతి బాగోతాల చిట్టా నా దగ్గరకు వచ్చింది. ఇంకొన్ని పద్దులు వస్తున్నాయి. త్వరలోనే అన్నీ బయటపెడతా. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె బీజేపీ. దీన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచి జరుగుతుంది. బీజేపీకి మతపిచ్చి ముదిరి దేశంలో పిచ్చి పిచ్చి చట్టాల్ని తీసుకు వస్తోంది'' అంటూ కేసీఆర్ విరుచుకుపడ్డారు. గడిచిన ఎనిమిదేళ్ల మోడీ పాలనలో దేశంలోని ఏ వర్గానికి మేలు జరగలేదన్న కేసీఆర్.. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందన్నారు.

ఈ సందర్భంగా మోడీ సర్కారుపై కేసీఆర్ చేసిన ఘాటు విమర్శలు.. ఆరోపణలు..వ్యాఖ్యల్ని చూస్తే..

-  మోడీ.. పార్లమెంటులో తెలంగాణ గురించి ఎందుకు గోక్కుంటున్నావు. మా బతుకు మేం బతికాం. ఇప్పుడు మళ్లీ కాళ్లలో కట్టెందుకు పెడుతున్నావు.కేంద్రాన్ని ప్రశ్నిస్తే నీ సంగతి చూస్తామంటున్నారు. కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎల్లకాలం కేసీఆర్ ఒక్కరే కొట్టాడడు. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి.

-  కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి. రాష్ట్రంలోని మేధావులు.. విద్యార్థులంతా ఒకసారి ఆలోచించాలి. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి రోజురోజుకు తగ్గిపోతోంది. సెప్టెంబరులో 4.4 శాతం ఉంటే.. అక్టోబరుకు 4 శాతం..డిసెంబరు నాటికి 0.4 శాతానికి పడిపోయింది. ఇదేనా బీజేపీ పాలనకు తార్కాణం?

-  మోడీ ప్రభుత్వం కొలువు తీరిన ఎనిమిదేళ్ల కాలంలో 15-16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. మత పిచ్ఛి.. కర్ఫ్యూ.. లాఠీ ఛార్జీలతో ఉంటే ఎవరి కడుపు నిండుతుంది. రాజకీయంగా ఈ సమయంలో కూడా స్పందించకుంటే దేశం నష్టపోతోంది. అమెరికా లాంటి దేశాల్లో మత పిచ్చి ఉండదు. అందుకే వారు ప్రపంచాన్ని ఏలుతున్నారు.

-  కేంద్రం చేసే తప్పుడు విధానాలను దేశమంతా ఇంగ్లిషు.. హిందీ.. ఉర్దూలో చెబుతాం. అందరం కలిసి ఆ పార్టీపై పోరాటం చేస్తాం. దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతోందో ప్రపంచమంతా గమనిస్తోంది. దేశ ఐటీ రంగానికి సిలికాన్ వ్యాలీ లాంటి బెంగళూరును కశ్మీర్ వ్యాలీగా మారుస్తున్నారు.
Tags:    

Similar News