గొర్రెల్ని వ‌ద్దంటున్నారు కేసీఆర్‌

Update: 2017-07-31 05:33 GMT
బంగారు తెలంగాణ నినాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చే ఏ మాట అయినా ఇట్టే అతికిపోయేలా ఉంటుంది. లాజిక్ అంద‌న‌ట్లుగా ఆయ‌న మాట్లాడుతున్న‌ట్లు ప‌లుమార్లు మ‌న‌సు హెచ్చ‌రిస్తున్నా.. ఆయ‌న మాట‌లు మాత్రం మాయ చేసిన‌ట్లుగా.. నిజ‌మే సుమా.. పొర‌పాటు ప‌డుతున్నామేమో అన్న భావ‌న‌కు గుర‌య్యేలా చేస్తుంటాయి.  ఆ మ‌ధ్య‌న గొర్రెల మీద ఫోక‌స్ చేసిన కేసీఆర్‌.. రానున్న రెండేళ్ల‌లో తెలంగాణ‌లోని గొల్ల కుర్మ‌ల‌ను ల‌క్షాధికారుల్ని చేయుడే కాదు.. వేలాది కోట్ల రూపాయిల్ని  తెలంగాణ ఆదాయంగా స‌మ‌కూరుస్తాన‌ని చెప్ప‌టం తెలిసిందే.

పెద్ద ఎత్తున గొర్రెల్ని తీసుకొచ్చి.. వాటిని గొల్ల కుర్మ‌ల‌కు 75 శాతం స‌బ్సిడీతో అప్ప‌జెప్ప‌టం ద్వారా.. భారీ ఎత్తున గొర్రెల్ని పెంప‌కానికి చేయూత‌నిస్తామ‌ని.. రానున్న రోజుల్లో వాటిని ఎగుమ‌తి చేయ‌టం ద్వారా భారీ ఎత్తున ఆర్థిక ప్ర‌యోజ‌నం పొందనున్న‌ట్లుగా ఒక క‌ల‌ర్ ఫుల్ సినిమా చూపించేవారు.

కేసీఆర్ మాట‌లు.. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే లెక్క‌లు విన్నంత‌నే.. రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ గురించి మార్కెటింగ్ ఉద్యోగులు చెప్పేంత టెంప్టింగ్ గా ఉండ‌టం.. ఇంత మంచి ఐడియా ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రులుగా చేసినోళ్ల‌కు రాలేదు ఎందుకో అంటూ తెగ ఫీలైపోయినోళ్లు ఉన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. యుద్ధ ప్రాతిప‌దిక‌న త‌న గొర్రెల ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెస్తూ వివిధ ప్రాంతాల నుంచి గొర్రెల్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. అయితే.. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన గొర్రెల్ని తీసుకోవ‌టానికి ల‌బ్థి దారులు ఆస‌క్తి చూప‌టం లేద‌న్న‌ది తాజా క‌బ‌ర్‌. ఇప్ప‌టికే పంపిణీ చేసిన గొర్రెల్లో చాలావ‌ర‌కూ రోగాల బారిన ప‌డ‌టం.. మ‌రికొన్ని మృత్యువాత ప‌డ‌టంతో.. గొర్రెల్ని తీసుకోవ‌టానికి ల‌బ్థిదారులు వెన‌క్కి త‌గ్గుతున్నారు.

75 శాతం స‌బ్సిడీతో గొర్రెల్ని ఇస్తున్నా.. రిస్క్ ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో పెట్టిన పాతిక‌శాతం పెట్టుబ‌డి పోతుంద‌న్న భ‌యం ప‌లువురు ల‌బ్థిదారుల్ని వెంటాడుతుంద‌ని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన గొర్రెలు ఒక్క‌సారిగా వ‌చ్చిన వాతావ‌ర‌ణ మార్పుల‌తో ఇమ‌డ‌లేక‌పోతున్నాయ‌ని తెలుస్తోంది. దీంతో.. అవి అనారోగ్యం బారిన ప‌డుతున్నాయి. అనారోగ్యంతో బ‌క్క‌చిక్కిన గొర్రెల‌కు వైద్యం చేయిస్తున్నా ఫ‌లితం ఉండ‌టం లేదంటున్నారు. దీంతో.. ప్ర‌భుత్వం ఇస్తున్న గొర్రెల్ని తీసుకునేందుకు ల‌బ్థిదారులు సిద్ధంగా ఉండ‌టం లేద‌ని చెబుతున్నారు. కేసీఆర్ క‌మ్మ‌టి గొర్రెల‌ సినిమాలో ఈ త‌ర‌హా మ‌లుపుల్ని ఊహించ‌లేదా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది.  మ‌రీ.. గొర్రెల ముచ్చ‌ట మీద కేసీఆర్ మ‌రోసారి దృష్టి పెడ‌తారంటారా?
Tags:    

Similar News