బ్రో ఇవేం హామీ హామీలు బ్రో ...  ఖ‌మ్మం పంట పండింది 

Update: 2023-01-18 15:39 GMT
ఖ‌మ్మం వేదిక‌గా.. భార‌త రాష్ట్ర‌స‌మితి..బీఆర్ ఎస్  అధినేత, సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన ఆవిర్భావ స‌భ‌లో ప్ర‌సంగించిన‌కేసీఆర్.. ఖ‌మ్మం జిల్లాపై క‌న‌క వ‌ర్షం కురిపించారు. నిజానికి ఈ ఎనిమిదేళ్ల పాల‌న‌లో ఎన్న‌డూ లేని విధంగా ఖ‌మ్మం జిల్లాకు ఆయ‌న అనేక వ‌రాలు ప్ర‌క‌టించారు. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద‌ల కోట్ల హామీలు గుండుగుత్త‌గా కుమ్మ‌రించారు. ఖమ్మంలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికీ రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు ప్ర‌త్యేకంగా ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, ఖమ్మం మున్నేరు నదిపై వంతెన నిర్మాణంతో పాటు.. ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తూ హామీల వర్షం కురిపించారు.

ఇదిలావుంటే, ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. సభకు తరలివచ్చిన ఆత్మీయ బంధువులకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు.

జిల్లాలోని జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా ఇళ్ల స్థలాలు ఇస్తామ‌న్నారు. ప్రభుత్వ స్థలం దొరక్కపోతే ప్రైవేటు భూములు సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామ‌ని.. వారి క‌ల నెర‌వేరుస్తామ‌ని చెప్పారు. బీఆర్ ఎస్‌ విధానం, వ్యూహం త్వ‌ర‌లోనే వివరంగా చెబుతామ‌ని చెప్పారు. భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమ‌న్న కేసీఆర్‌ జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉంద‌ని వెల్ల‌డించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News