ఈ దెబ్బ‌కు కేసీఆర్ సిండ్రోమ్ పోయిందంట‌!

Update: 2019-05-25 14:30 GMT
తెలంగాణ‌లో తిరుగులేని ప‌వ‌ర్ ఫుల్ అధినేత కేసీఆర్‌. ఈ విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి అనుమానాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఆయ‌నంటే తెలంగాణ రాజ‌కీయ పార్టీల‌న్నింటికి భ‌యంతో కూడిన భ‌క్తి. ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకొని త‌మ ఉనికిని ప్ర‌శ్నార్థ‌కం చేస్తార‌న్న భావ‌న‌లో ఉండేవారు.

అదంతా మే 23కు ముందు మాత్ర‌మే. తాజాగా వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాలు కేసీఆర్‌ కు భారీ షాక్ ఇవ్వ‌ట‌మే కాదు.. అన్నింటికి మించిన ఆయ‌నంటే భ‌యం పోయేలా చేసింది. కేసీఆర్ ను ఢీ కొట్ట‌టం సాధ్య‌మ‌య్యే య‌వ్వారం కాద‌ని.. ఆయ‌న్ను ఢీ కొట్టాలంటే ఎక్క‌డి నుంచో ఊడిప‌డాల‌న్న భావ‌న‌ను తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు బ్రేక్ చేశాయి.

ఇంత‌కాలం తెలంగాణ రాష్ట్రంలోని రాజ‌కీయ నేత‌ల‌కు కేసీఆర్ సిండ్రోమ్ తో తెగ ఇబ్బంది ప‌డేవారు. ఆయ‌న వ్యూహ చ‌తుర‌త‌కు బెదిరిపోయేవారు. తాజా ఫ‌లితాలు అలాంటివ‌న్నీ పెద్ద విష‌యాలు కావ‌ని.. కేసీఆర్ కూడా స‌గ‌టు రాజ‌కీయ నేతేన‌ని.. ఆయ‌న కూడా త‌ప్పులు చేస్తార‌ని.. వాటికి ప్ర‌జ‌లు సీరియ‌స్ అయి బుద్ది చెప్పేందుకు సైతం వెనుకాడ‌ర‌న్న విష‌యం తాజా ఎన్నిక‌లు స్ప‌ష్టం చేశాయి.

మొత్తం ప‌ద‌హారు సీట్లు గెలుస్తామనుకుంటే తొమ్మిది సీట్లు మాత్ర‌మే గెలిచిన టీఆర్ ఎస్ కు త‌న ఓట‌మిని పెద్ద‌దిగా ప్రొజెక్ట్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. కొద్దిమంది టీఆర్ ఎస్ నేత‌లు త‌మ ఓట‌మిని త‌క్కువ చేసి చూపిస్తున్న ప‌రిస్థితి. అయితే.. ఈ రెండు త‌ప్పేన‌ని.. వారెవ‌రూ ప‌ట్టించుకోని ఒక అంశం టీఆర్ ఎస్ కు తీవ్ర న‌ష్టం వాటిల్లేలా చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

ఇంత‌కాలం తెలంగాణ నేత‌ల‌కు ఉన్న కేసీఆర్ సిండ్రోమ్ తాజా ఫ‌లితాల‌తో వ‌దిలిపోతుంద‌ని.. ఆయ‌న్ను ఢీ కొట్ట‌టానికి అవ‌స‌ర‌మైన శ‌క్తియుక్తుల్ని ఇస్తుంద‌న్న అభిప్రాయం ఉంది. అత్యుత్సాహం.. మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో పాటు.. తాను మాత్ర‌మే ప‌వ‌ర్ ఫుల్ గా ఉండి.. మ‌రెవ‌రూ త‌న ద‌రిదాపుల్లోకి రాకూడ‌ద‌న్న ఆశ.. మొద‌టికే మోసం తెచ్చేలా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News