జూపల్లికి భారీ షాకిచ్చేందుకే సారు డిసైడ్ అయ్యారుగా?

Update: 2020-01-26 07:26 GMT
అధికారం చేతిలో ఉన్నా లేకున్నా క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఎంత అధికారం ఉన్నప్పటికీ.. పార్టీలో క్రమశిక్షణ లేకుండా సదరు పార్టీ తర్వాతి కాలంలో ఎలా తయారవుతుందన్న దానికి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీని చెప్పొచ్చు. పవర్లో ఉన్నా లేకున్నా లుకలుకలతో ఉండే ఆ పార్టీ.. నిత్యం నేతల మధ్య ఏదో ఒక పంచాయితీ తప్పనిసరి. అయితే.. ఇలాంటి అవలక్షణాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదన్న పట్టుదలతో ఉంటారు కేసీఆర్. పైకి మాట్లాడినట్లు కనిపించకున్నా.. అంతర్గతంగా పావులు కదుపుతూ ఎవరిని ఎప్పుడు ఎక్కడ నొక్కాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి.

పార్టీతో సంబంధం లేకుండా తన వర్గీయులు పదకొండు మందిని  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి.. గెలిపించుకున్న వైనం సంచలనంగా మారింది. మున్సిపల్ పీఠాన్ని కైవశం చేసుకోవటానికి 12 స్థానాలు అవసరమైన వేళ.. టీఆర్ఎస్ లో కేవలం 9 స్థానాలు గెలిస్తే.. జూపల్లి వర్గీయులు 11 స్థానాల్లో గెలిచారు. మొత్తం 20 స్థానాలున్న మున్సిపాటిలీ పీఠాన్ని సొంతం చేుసకునేందుకు అవసరమైన 12 స్థానాలకు.. తాను పోటీ చేయించిన వారిని పార్టీలోకి తీసుకోవాలన్న సూచన జూపల్లి చేస్తే.. పార్టీ మాత్రం అందుకు ససేమిరా అంటోందట.

ఎక్స్ అఫీషియ్ సభ్యుల్ని సెట్ చేసి మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలే తప్పించి.. ఎట్టి పరిస్థితుల్లోనూ జూపల్లి సాయం తీసుకోకూడదని డిసైడ్ అయ్యారు. ఆయనకుసంబంధించిన 11 మంది సభ్యులు ఉన్నా.. వారి అవసరం లేదని తేల్చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు అయ్యాక.. గెలిచిన వారికి పెద్దపీట వేస్తూ.. రెబెల్స్ ను బుజ్జగించటం రివాజు. అందుకు భిన్నంగా జూపల్లి ఆటలకు చెప్పేందుకు కేసీఆర్ కరకుగా ఉండాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తాను ఒకటనుకుంటే అధినేత అందుకు భిన్నంగా చేసిన ప్లాన్ జూపల్లి అండ్ కోకు ఒక పట్టాన మింగుడుపడటం లేదంటున్నారు. పట్టు దొరికిన వేళలోనూ.. సడలిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని షాకులు తప్పవు. ఈ విషయం కేసీఆర్ ప్లానింగ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.


Tags:    

Similar News