క‌శ్మీర్ పేరు చెప్పి రెండు పార్టీల్ని తిట్టిపోశారు

Update: 2018-04-27 10:35 GMT
ఒక‌సారి ఒక అంశం మీద క్లారిటీ వ‌చ్చి.. ఆ ఇష్యూను టేక‌ప్ చేయాల‌ని డిసైడ్ అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంత హోంవ‌ర్క్ చేస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. మేధావులు.. వివిధ వ‌ర్గాల‌కు చెందిన వారితో రోజుల త‌ర‌బ‌డి మ‌ధ‌నం చేసి.. తాను అనుకున్న ఇష్యూను ఎలా టేక‌ప్ చేయాలో ఆయ‌న చాలా ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఆయ‌న వ్యూహం ఎంత ప‌క‌డ్బందీగా ఉంటుంద‌న్న విష‌యాన్ని టీఆర్ ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌సంగాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

తొలుత త‌న తెలంగాణ విజ‌యాన్ని.. త‌ర్వాత నాలుగేళ్ల పాల‌న‌లో తాము సాధించిన విజ‌యాల్ని వివ‌రంగా చెప్పుకున్న కేసీఆర్‌.. తమ‌నుతాము పొగుడుకునే క‌న్నా.. ప‌క్క రాష్ట్రాల వారు.. వేర్వేరు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖులు తెలంగాణ‌కు వ‌చ్చి.. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానాల్ని ఎంత‌గా పొగుడుతున్నారో చెప్పుకొచ్చారు. అనంత‌రం దేశంలో ఆ రెండు పార్టీలేనా?  అంత‌కు మించిన ప్ర‌త్యామ్నాయం లేదా? అన్న ప్ర‌శ్న‌ను సంధించి.. తాను ఉన్నాన‌ని.. రంగంలోకి వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌క‌టించేశారు.

అది మొద‌లు.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌పై విరుచుకుప‌డిన కేసీఆర్‌.. కేంద్రం పేరుతో రాష్ట్రాల మీద పెత్త‌నం ఏమిటంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ప్ర‌ధాన‌మంత్రి స‌డ‌క్ యోజ‌న లాంటి ప‌థ‌కాల్ని ప్ర‌స్తావించి.. తెలంగాణ‌లోని ఒక చిన్న గ్రామానికి వేసే రోడ్డును ప్ర‌ధాని మాత్ర‌మే వేయాలా?  రాష్ట్రం వేసుకోకూడ‌దా? అస‌లు ఆ అవ‌స‌రం ఏమిట‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. కేంద్రం దృష్టి సారించిన పాల‌నా వ్య‌వ‌హారాలు ఏమిటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌.. శ‌త్రుదేశాల నుంచి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను  ఎదుర్కోవ‌టంలో ఫెయిల్ అవుతున్నార‌ని చెప్పిన కేసీఆర్‌.. క‌శ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావించారు. అక్క‌డ మ‌న జ‌వాన్లు రోజూ వంద‌ల మంది చ‌నిపోతున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు (నిజానికి మ‌ర‌ణాల్లో అంత తీవ్ర‌త లేన‌ప్ప‌టికీ.. కేసీఆర్ నోటి వెంట ఫ్లోలో ఆ మాట వ‌చ్చేసింద‌నుకోవాలి) రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నం ఏమిటంటూ సూటిగా ప్ర‌శ్నిస్తూ.. ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. క‌శ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చేయ‌టంలో రెండు జాతీయ పార్టీలు ఫెయిల్ అయ్యాయ‌య‌ని చెప్పారు.
 
దేశంలో మౌలిక వ‌స‌తులు స‌రిగా లేవ‌న్న ఆయ‌న‌.. అంత‌ర్జాతీయంగా ర‌వాణా ట్ర‌క్కుల స‌గ‌టు వేగం.. చైనాలో స‌రుకు ర‌వాణా గూడ్స్ రైళ్ల స‌గ‌టు వేగం లెక్క‌లు చెప్పి.. దేశంలో ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించి.. ఇంత దారుణ‌మైన ప‌రిస్థితా? అని ప్ర‌శ్నించారు.

దేశంలో మౌలిక వ‌స‌తులు ఏమాత్రం బాగోలేవ‌న్న ఆయ‌న సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ కంటే న్యూయార్క్ లోని టాయిలెట్లు బాగుంటాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌కు ఏటీఎంల‌లో డ‌బ్బులు దొర‌క‌వు కానీ.. నీర‌వ్ మోడీల‌కు మాత్రం ప్ర‌జ‌ల సొమ్మును దోచుకొని పారిపోతారంటూ మండిప‌డ్డారు.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కార్యాచ‌ర‌ణ‌ను చూచాయిగా బ‌య‌ట‌పెట్టారు. రానున్న రెండు నెల‌ల్లో ప‌క్షి మాదిరి తాను ప‌ర్య‌టిస్తాన‌ని.. ఈ నెల 29న చెన్నైకి వెళ్లి డీఎంకే నేత స్టాలిన్ ను క‌లుస్తాన‌ని.. మే2న హైద‌రాబాద్‌లో అఖిలేశ్ తో  ఫ్రంట్ ఏర్పాటుపై చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని చెప్పారు. హైద‌రాబాద్ కేంద్రంగా దేశ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసే స‌మ‌యంలో హిందీలో మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. కేసీఆర్‌ త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్ ను ఢిల్లీకి ధీటుగా పంపార‌నే చెప్పాలి.


Tags:    

Similar News