విజ‌య‌వాడ‌కు కేసీఆర్‌...మొక్కులే ఎజెండా

Update: 2017-09-06 07:34 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు ఆంధ్ర‌ప్రదేశ్‌ లో అడుగుపెట్ట‌నున్నారు. కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించేందుకు కేసీఆర్ బెజ‌వాడ‌లో అడుగుపెట్ట‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. తెలంగాణ‌ రాష్ట్రం ఏర్ప‌డితే తాను మొక్కులు చెల్లించుకుంటాన‌ని టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఈ మేర‌కు ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి నిధులు మంజూరు చేయించారు. అనంత‌రం వ‌రంగ‌ల్‌ లోని భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ఆభ‌ర‌ణాలు కొద్దికాలం క్రితం స‌మ‌ర్పించుకున్నారు. కొద్దికాలం క్రితం తిరుమ‌ల వెళ్లి క‌లియుగ దైవం మొక్కు చెల్లించుకున్నారు. దాదాపు 5 కోట్ల విలువైన ఆభరణాలను శ్రీనివాసునికి కానుకగా సమర్పించనున్నారు. రెండు హారాలు - పద్మావతి అమ్మవారికి ఒక ముక్కు పుడకను సమర్పించి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. దీంతోపాటుగా కురవి వీరభద్రుడికి బంగారు మీసం మొక్కు సమర్పించుకున్నారు. ఇక‌ మిగిలిపోయిన మొక్కు అయిన విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ముక్కుపుడ‌క స‌మ‌ర్ప‌ణ‌కు ఈనెలాఖ‌రులో వెళ్ల‌నున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కసారి ఆంధ్రాకు వెళ్లారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా వెళ్లిన ఆయన తిరిగి ఈనెల 27న విజయవాడకు వెళ్ల‌నున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజయవాడ పర్యటన ఖరారు అయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్ అక్క‌డి నుంచి వచ్చిన తర్వాత దుర్గమ్మ మొక్కు తీర్చుకుంటానని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మకు కూడా ముక్కుపుడక సమర్పించుకునే స‌మ‌యంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా వెళతారని స‌మాచారం. తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్న కేసీఆర్ ఈ నెల‌లో త‌న చివ‌రి మొక్కును పూర్తి చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

కాగా, 2001 తర్వాత మళ్లీ 2016లో అంటే 16 సంవత్సరాల తర్వాత కేసీఆర్ తిరుమలకు వెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చినందుకు వెంకటేశ్వరుడికి మొక్కు చెల్లించుకున్నారు.  అయితే సీఎం కుటుంబ సభ్యులు శ్రీవారిని ప‌లుమార్లు దర్శించుకున్నారు.
Tags:    

Similar News