తుమ్మ‌ల‌కు ఎమ్మెల్సీ?..కేసీఆర్ ఏమంటారో?

Update: 2019-05-10 17:54 GMT
తొలుత అసెంబ్లీ - ఆ త‌ర్వాత లోక్ స‌భ‌ - ఇప్పుడు స్ధానికం - రేపు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు... వెర‌సి తెలంగాణ‌లో నాన్ స్టాప్ ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. ఇప్ప‌టికే తొలి రెండు ఎన్నిక‌లు ముగియ‌గా... మూడో ఎన్నిక ర‌న్నింగ్ లో ఉంది. ఈ మూడు ఎన్నిక‌ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పెద్ద‌గా ఒత్తిడికి గురి కాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే... అప్ప‌టికే పార్టీ యంత్రాంగం మొత్తాన్ని ఓ విధ‌మైన డైల‌మాలో ప‌డేసిన కేసీఆర్... అభ్య‌ర్థిత్వాల విష‌యంలో త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా అభ్య‌ర్థుల‌కు రాలేదు. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో కేసీఆర్ ఓ ర‌క‌మైన ఇబ్బందిని ఎదుర్కోక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే... ఇప్పుడు తెలంగాణ‌లో కేవ‌లం మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు మాత్ర‌మే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ సీట్ల‌ను ఆశిస్తున్న నేత‌ల జాబితా మాత్రం చాంతాడంత ఉంద‌నే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో టీఆర్ ఎస్ విజ‌యం సాధించినా.. కేసీఆర్‌ కు అత్యంత స‌న్నిహితంగానే కాకుండా పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న ప‌లువురు నేత‌లు ఓడిపోయారు. ఇలా ఓడిపోయి... ఇప్పుడు ఎమ్మెల్సీ అవ‌కాశం ద‌క్క‌క‌పోతుందా? అని ఎదురు చూస్తున్న  నేత‌ల్లో మాజీ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు - అజ్మీరా చందూలాల్ - పట్నం మహేందర్ రెడ్డి - జూపల్లి కష్ణారావులు ఉన్నారు. అందుబాటులో ఉన్న‌వి మూడే సీట్లు అయితే... ఈ న‌లుగురిని కూడా సంతృప్తి ప‌రిచే అవ‌కాశం లేదు. ఇక గ‌త కేబినెట్ లో హోంమంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నాయిని న‌ర్సింహారెడ్డికి ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ ద‌క్క‌లేదు. అలాగ‌ని ఎంపీ సీటు కూడా ద‌క్క‌లేదు. నాయిని ఆశించిన‌ట్లుగా ఆయ‌న అల్లుడికి కూడా సీటు ద‌క్క‌లేదు. దీంతో టీఆర్ ఎస్ లో సీనియ‌ర్ మోస్ట్ గా ఉన్న నాయిని అవ‌కాశం క‌ల్పించాలన్న డిమాండ్ బ‌లంగానే వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... గ‌జ్వేల్ లో కేసీఆర్ పై రెండు సార్లు పోటీ చేసి ఓట‌మి పాలైన వంటేరు ప్ర‌తాప్ రెడ్డి... మొన్న‌టి అసెంబ్లీ ఎన్నికల త‌ర్వాత టీఆర్ ఎస్ లో చేరిపోయారు. మంచి ప‌ద‌విని ఆశ‌జూపిన మీద‌టే ప్ర‌తాప్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరార‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా కేసీఆర్ పైనే పోటీ చేసి ఆ త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చిన ప్ర‌తాప్ రెడ్డి అంటే పార్టీ అధిష్ఠానానికి కూడా ఓ ర‌క‌మైన గౌర‌వ భావం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తాప్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్న‌ట్టే లెక్క‌. ఇక వీరితో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు - లోక్ స‌భ ఎన్నికల్లో టికెట్లు ద‌క్క‌ని వారు - ఇత‌ర పార్టీల నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన వారు చాలా మందే ఉన్నారు. మ‌రి ఆశావ‌హులు లెక్క‌లేనంత మంది ఉంటే.... చేతిలో ఉన్న మూడు సీట్ల‌ను కేసీఆర్ ఎవ‌రికి ఇస్తారనే విష‌యం ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మ‌రోవైపు కేర‌ళ‌ - త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన కేసీఆర్ శుక్ర‌వారం రాత్రికి హైద‌రాబాద్ చేరుకుంటారు. శ‌నివారం ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఖ‌రారుపై ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకుంటారన్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ యోగం ఎవ‌రికి ద‌క్కుతుందోన‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.


Tags:    

Similar News